కళాతపస్వి మధురస్మృతులు.. మీకోసం - కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత
🎬 Watch Now: Feature Video
కృష్ణాతీరం చిన్నబోయింది. కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ హఠాన్మరణాన్ని సినీప్రేక్షకులు, కళాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణా తీరంతో విశ్వనాథునికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2017లో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్వంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌ను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా సత్కరించారు.
తెలుగు కళలను, సంస్కృతిని గుర్తు చేసేలా, వాటిని కాపాడేలా ఎన్నో కళాఖండాలను రూపొందించిన తపస్వి.. తెలుగు వారికి ఘనమైన వారసత్వ సంపదగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కళాభిమానులు కొనియాడారు. సినిమా అనే బస్సుకు తాను ఒక డ్రైవరును మాత్రమేనని.. ప్రయాణికులనే ప్రేక్షకులను ఏ ఇబ్బందులకు గురి చేయకుండా వారు కోరుకున్న గమ్యస్థానాలకు చేర్చడమే తన సినిమాల్లోని లక్ష్యంగా.. పనిచేశానని ఆనాటి తన ప్రసంగంలో తెలిపారు.
కె.విశ్వనాథ్ స్వస్థలం బాపట్ల జిల్లా రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆయన తండ్రి చెన్నైలోని విజయవాహినీ స్టూడియోలో పనిచేసేవారు. దీంతో విశ్వనాథ్ డిగ్రీ పూర్తవగానే అదే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా సినీజీవితాన్ని ప్రారంభించారు.
తొలిసారి పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పనిచేశారు. 1965లో 'ఆత్మగౌరవం' సినిమాకు దర్శకుడిగా అవకాశం లభించింది. తొలి చిత్రానికే ఆయనకు నంది అవార్డు అందుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని గౌరవాన్ని తీసుకొచ్చిన ఆయన 50కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ 9 చిత్రాలకు విశ్వనాథ్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఎన్నో చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.