Anitha Meets BR Naidu : తిరుమల శ్రీవారిని హోం మంత్రి అనిత దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వదించి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ క్రమంలోనే అనిత టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనకాపల్లి జిల్లా ఉపమాకలో ఉన్న టీటీడీ అనుబంధ ఉపమాక వెంకన్న దేవాలయ అభివృద్ధికి సహకరించాలని వినతిపత్రం అందించారు.
టీటీడీకి 2017లో ఉపమాక ఆలయాన్ని అప్పగించినట్లు బీఆర్ నాయుడుకు అనిత వివరించారు. ఐదు ఎకరాలలో ఉన్న అత్యంత ప్రాశస్త్యం గల దేవాలయమని చెప్పారు. కానీ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. ఈ గుడిని అన్ని విధాల అభివృద్ధి చేసి, పూర్వవైభవం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. హోం మంత్రి వినతిపై బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఉపమాక అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు
అనంతరం అనిత మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో అనకాపల్లి జిల్లాలోని ఉపమాక వెంకన్న ఆలయానికి పూర్వ వైభవం రాబోతుందని తెలిపారు. నిత్య ఉత్తర ద్వార దర్శనం కూడా ఉపమాకలో జరుగుతుందని చెప్పారు. దేవాలయ అభివృద్ధి గురించి టీటీడీ ఛైర్మన్‌కు వివరించినట్లు పేర్కొన్నారు. ఆయన దీనిపై సానుకూలంగా స్పందించారని వివరించారు. ఈ క్రమంలోనే శ్రీవారి ఆలయ ఉపరితలంపై విమాన రాకపోకలపై ఆమె స్పందించారు. ఆగమ శాస్త్రాల ప్రకారం విమానాలు ప్రయాణించకూడదని దీనిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని అనిత వెల్లడించారు.
ఉపమాకలో టీటీడీ అనుబంధ ఆలయ అభివృద్ధికి సహకరించాలని టీటీడీ ఛైర్మన్‌ని కోరాం. ఆగమ శాస్త్రాల ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయంపై విమానాల ప్రయాణం లేదు. విమానాల ప్రయాణంపై విచారించి చర్యలకు ఆదేశిస్తాం. - హోం మంత్రి అనిత
అలిపిరి నుంచి తిరుమల నడక మార్గంలో పటిష్ఠ భద్రతా చర్యలు
మోకాళ్ల నొప్పులను మాయం చేసే 'తలయేరు గుండు'! - ఎక్కడో తెలుసా?