World Piles Day : మన శరీరాన్ని ఎన్నో వ్యాధులు ఇబ్బంది పెడతాయి. కానీ.. పైల్స్ ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. అందుకే పైల్స్‌తో ఇబ్బంది పడేవారు ఈ వ్యాధి ఎంత త్వరగా తగ్గిపోతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రధానంగా పురీష నాళం, పాయువుల వద్ద సిరలు వాచిపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మలవిసర్జన నాళంలో ఏర్పడే ఈ ఆరోగ్య సమస్య మలాన్ని విసర్జించే సమయంలో మరింత ఎక్కువగా బాధిస్తుంది. మలంలో రక్తం పడడానికి ఇవే సాధారణమైన కారణంగా చెప్పవచ్చు. ఇవి చాలా అరుదుగా ప్రమాదకరమైనవిగా మారతాయి. ఈ పరిస్థితిని నిర్ధరించడానికి వైద్యుడిని సంప్రదించాలి. కొన్నిసార్లు ఈ హెమరాయిడ్లు వాటంతట అవే బయటకు వెళ్లిపోతాయి. మరికొన్నిసార్లు చికిత్స అవసరం అవుతుంది.
"మలద్వారం దగ్గర ఏనల్ కుషన్స్ ఉంటాయి. మలం గట్టిగా, రాయిలా వచ్చినప్పుడు ఆ ఏనల్ కుషన్స్ కిందకు జారతాయి. దానినే హెమరాయిడ్స్ లేదా పైల్స్ అంటాం. ఆ ఏనల్ కుషన్స్ ఎంత దూరం జారాయి అనేదానిబట్టి పైల్స్ తీవ్రతను గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3, గ్రేడ్-4 అంటాం. చాలావరకు గ్రేడ్-1, గ్రేడ్-2 ఉంటాయి. వాటిని మందులు, ఆహార పద్ధతుల్లో మార్పులు ద్వారా తగ్గించడానికి ఆస్కారముంది. గ్రేడ్-3, గ్రేడ్-4 విషయంలో మాత్రం అలా కాదు. అలాంటి కేసుల్లో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి గ్రేడ్-1, గ్రేడ్-2 కేసుల్లోనూ రక్తస్రావం ఎక్కువగా ఉంటే మందులతోపాటు శస్త్రచికిత్స కూడా అవసరం అవుతుంది." అని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ టి.లక్ష్మీకాంత్ గతంలో ఈటీవీ లైఫ్‌తో చెప్పారు.
పైల్స్ రాకుండా ఉండాలంటే?
Piles Symptoms And Treatment : పైల్స్ రాకుండా ఉండాలంటే.. సరిపడా నీళ్లు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి. సరిపడా నీళ్లు తాగకపోతే.. మలంలోని నీటిని శరీరం తీసుకుంటుంది. అప్పుడు మలం గట్టిగా అయి.. మోషన్‌కు వెళ్లడంలో ఇబ్బంది ఎదురవుతుంది. పైల్స్‌ను నివారించేందుకు.. శరీరానికి ఏదొక రకమైన వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. ఫైబర్‌తో కూడిన ఆహారం తీసుకోవాలి. ఫైబర్ శరీరంలో ఉంటే.. పేగుల కదలిక బాగుంటుంది.
పైల్స్ లక్షణాలేంటి?
Piles Symptoms in Telugu : ఏ రకం పైల్స్ అనేదానిబట్టి లక్షణాలు ఉంటాయి. అంతర్గత పైల్స్ అయితే అవి బయటకు కనిపించవు. అవి పురీషనాళం లోపలి గోడల వెంబడి ఉంటాయి. అక్కడ ఎక్కువ నరాలు ఉండవు కాబట్టి పెద్దగా నొప్పి తెలియదు. ఈ అంతర్గత హెమరాయిడ్స్ను మలవిసర్జన సమయంలో, శుభ్రం చేసుకునేటప్పుడు గుర్తించవచ్చు. ఇవి వాటంతట అవే లోపలకు వెళ్లి యథాస్థానానికి చేరిపోతాయి.
బాహ్య పైల్స్.. పాయువు చుట్టూ, చర్మం కింద భాగంలోనే ఉంటాయి. అక్కడ నరాలు ఎక్కువగా ఉండడం వల్ల నొప్పి బాగా ఉంటుంది. బ్లీడింగ్, నొప్పి, దురద, వాపు.. బాహ్య పైల్స్ ప్రధాన లక్షణాలు. రక్తం గడ్డకట్టి పర్పుల్ లేదా నీలం రంగులోకి మారుతుంది. గడ్డకట్టిన రక్తం కరిగినప్పుడు చిరాకు కలుగుతుంది.
పైల్స్ ఎందుకు వస్తాయి?
పైల్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. పురీషనాళం కింది భాగంలో ఒత్తిడి పెరిగిపోయినప్పుడు సిరలు ఉబ్బిపోయి ఈ సమస్య తలెత్తవచ్చు. పేగుల కదలికల్లో ఒత్తిడి, ఊబకాయం, పెరుగుతున్న గర్భాశయం సిరలపై ఒత్తిడి పెంచడం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటివి పైల్స్ రావడానికి కారణాలు కావచ్చు.
"పైల్స్ రావడానికి ప్రధాన కారణం.. మలబద్ధకం. సరిపడా ఫైబర్ లేకపోవడం వల్ల సరైన సమయానికి మోషన్‌కు వెళ్లలేరు. నీళ్లు సరిగా తాగకపోతే మలం గట్టిగా అయిపోతుంది. 24గంటల్లో మలం బయటకు వెళ్లిపోవడం చాలా అవసరం. కానీ.. ఆ మలం అలానే పేగుల్లో ఉండిపోయినప్పుడు అందులోని నీటిని శరీరం పీల్చేసుకుంటుంది. అప్పుడు మలం మరింత గట్టిపడుతుంది. అలా గట్టిపడిన మలం బయటకు వెళ్లినప్పుడు మలద్వారం దగ్గర కోసుకుని.. ఫిషర్, పైల్స్ ఏర్పడతాయి.
అందుకే క్రమం తప్పకుండా మోషన్‌కు వెళ్లాలి. చిన్నతనం నుంచే దీనిని అలవాటు చేయాలి. చాలా మంది పిల్లలు, పెద్దలు ఉదయం సరిగా నీళ్లు తాగరు. మలవిసర్జన చేయకుండానే బడికి, పనికి వెళ్లిపోతారు. మరుగుదొడ్లు సరిగా లేక కొందరు అలానే ఉండిపోతారు. ఇలాంటి కారణాల వల్ల మోషన్ గట్టిగా అయిపోతుంది. తర్వాత అది బయటకు వచ్చినప్పుడు మలద్వారం దగ్గర ఉండే ఏనల్ కుషన్స్ బయటకు వచ్చి, ఇబ్బంది పెడతాయి. అందుకే.. పైల్స్ రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా మోషన్‌కు వెళ్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్నతనంలోనే టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి. వయసు పెరిగే కొద్దీ పేగుల కదలిక నెమ్మదిస్తుంది. అందుకే ఏదొక వ్యాయామం చేస్తే పెద్దపేగు కదలిక బాగుంటుంది. మలబద్ధకాన్ని నివారించవచ్చు." అని చెబుతున్నారు డాక్టర్ లక్ష్మీకాంత్.
చికిత్స ఎలా?
How To Cure Piles Without Operation : సాధారణంగా పైల్స్ లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే.. వాటి తీవ్రతను బట్టి వైద్యులు చికిత్సను అందిస్తూ ఉంటారు. రోజువారీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యను సులువుగా ఎదుర్కోవచ్చు. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు తీసుకుంటే వారంరోజుల్లోనే మంచి ఫలితం ఉంటుంది! వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగడం మంచిది. నొప్పితోపాటు వాపు, దురదను తగ్గించే మందులు వాడడం ద్వారా ఉపశమనం పొందొచ్చు. వీటిని ఉపయోగించాక కూడా అలాంటి లక్షణాలే ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.
మెంతులతో ఎన్ని లాభాలో- మొటిమలకు చెక్- మీ ముఖంలో గ్లో పక్కా!
అల్లం టు సోంపు.. బెల్లీఫ్యాట్ తగ్గించే 6 ఆయుర్వేద మూలికలు ఇవే!