Weight Loss Tips : మనలో చాలా మందికి మంచి శరీరాకృతిని మెయింటేన్ చేయాలని ఉంటుంది. కొందరు కొంచెం బరువు పెరిగినా తట్టుకోలేక అనేక రకాల వ్యాయామం చేసి తగ్గాలనుకుంటారు. కానీ బరువు తగ్గడం అనేది అంత సులభమైన టాస్క్ కాదు. ఎందుకంటే వర్కవుట్లు చేసి శారీరకంగా చాలా శ్రమించాలి కాబట్టి. దీనికి తోడు కఠినమైన డైట్ పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తొందరగా అలసిపోతారు. ఫలింగా కొన్ని రోజులకు బరువు తగ్గాలన్న ఆసక్తి పోతుంది.
బరువు తగ్గే క్రమంలో బాడీ ఆకృతి అనేది చాలా ముఖ్యమైంది. దీంతోపాటు మొత్తం ఆరోగ్యం మీద కూడా ఒక లుక్కేయడమూ అవసరమే. బరువు తగ్గాలనుకునే సమయంలో ప్రాసెస్ చేయని ఆహారం తీసుకోవడం ప్రధాన పాత్ర పోషిస్తుంది. తృణ ధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. అవి మీకు అధిక శక్తిని ఇవ్వడమే కాకుండా.. మీ ఆరోగ్యాన్నీ కాపాడతాయి. మీరు అలసిపోకుండా బరువు తగ్గాలంటే ఈ 4 పనులు చేయండి.
1. ఆహార పరిమాణం
Weight Loss Diet : బరువు తగ్గాలనుకునే క్రమంలో మనం తీసుకునే ఆహార పరిమాణం ముఖ్యం. ఈ సమయంలో తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. తినే పదార్థాలు వేసుకునే పాత్రలూ చిన్నవిగా ఉండేట్లు చూసుకోవాలి. అప్పడు తినే సామర్థ్యం మించకుండా, ఆహారం తక్కువగా తీసుకోవడంలో ఇవి మీకు సాయపడతాయి. దీంతో పాటు మెల్లగా తినటం వల్ల కూడా కడుపు తొందరగా నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి తగినంత ఆహారం మాత్రమే తీసుకుంటారు.
2. ప్రోటీన్లు
మన డైట్ ప్లాన్‌లో ప్రోటీన్లు తీసుకోవడం ముఖ్యం. రోజూ తినే ఆహారంలో తగినంత ప్రోటీన్లు ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. ఇవి తొందరగా ఆకలి కాకుండా చూస్తాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఆకలి హార్మోన్ అయిన గ్రెలిన్ ఉత్పత్తి స్థాయిని తగ్గించి GLP-1, peptide YY, Cholecystokin లాంటి హార్మోన్లను ఉత్పత్తిని పెంచుతాయి. ఇవన్నీ అలసిపోకుండా బరువు తగ్గేందుకు పనిచేస్తాయి.
3. చెక్కర
చెక్కర క్యాలరీలకు మూలం. ఇందులో ఎలాంటి పోషకాలు ఉండవు. పైగా బరువు పెరగడానికి కారణమవుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారు దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రోజూ ఎంత మేర చెక్కర తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు చూసుకోవడం ఉత్తమం.
4. తాగునీరు
Weight Loss Drink : మన శరీరాన్ని రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచుకునేలా చూసుకోవాలి. మీరు రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగడం వల్ల.. శరీరం తన విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తుంది. రోజుకు కనీసం 2 లీటర్ల (8 కప్పులు) నీళ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.