వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎండలు హడలెత్తిస్తాయి. వడగాల్పులు, ఉక్కబోతతో చాలా మంది డీహైడ్రేషన్‌కు గురవుతూ ఉంటారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు చాలామంది శీతల పానియాల వైపు మొగ్గు చూపుతారు. కొబ్బరిబొండం నీళ్లు, జ్యూస్‌లు, చెరుకు రసం వంటివి తీసుకుంటూ ఉంటారు. అలాగే ఎండాకాలం నిమ్మరసాన్ని చాలామంది తీసుకుంటూ ఉంటారు. వేసవి కాలంలో డీహైడ్రేషన్ నుంచి మనల్ని నిమ్మ కాపాడుతుంది. ఎండాకాలంలో శరీరానికి చల్లదనాన్ని అందించే నిమ్మకాయల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎండాకాలంలో వడదెబ్బకు గరి కాకుండా నిమ్మ కాపాడుతుంది. అలాగే రక్తప్రసరణ బాగా జరగడానికి కూడా నిమ్మరసం సహాయపడుతుంది. నిమ్మకాయలో పోషక విలువలను ఓసారి పరిశీలిస్తే..
- శక్తి 30 కిలో కేలరీలు
- పిండి పదార్థాలు 9 గ్రాములు
- చక్కెర 2.5 గ్రాములు
- పీచు పదార్థాలు 2.8 గ్రాములు
- కొవ్వు పదార్ధాలు 0.3 గ్రాములు
- ప్రోటీన్ 1.1 గ్రాములు
- మాంసకృతులు 1.1 గ్రాములు
- మెగ్నీషియం 8 మిల్లీగ్రాములు
- పాస్పరస్ 16 మిల్లీగ్రాములు
- నీరు 89 గ్రాములు
- విటమిన్ సీ 53 మిల్లీ గ్రాములు
- సిట్రిక్ యాసిడ్ 88 మిల్లీగ్రాములు
- నిమ్మకాయలో విటమిన్ బి కూడా ఉంటుంది.
ఇలా తీసుకుంటే నష్టమే..
అయితే నిమ్మరసాన్ని నిల్వ చేసి తీసుకోకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మరసాన్ని నిల్వ చేయడం వల్ల పాడై పోవడమే కాకుండా పోషక విలువలు తగ్గుతాయని అంటున్నారు. అంతేకాకుండా వేడి తగలడం వల్ల కూడా నిమ్మరసం నశించిపోతుంది. ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల కూడా వాటి సహజతత్వాన్ని కోల్పోతాయి. నిమ్మరసం తీసిన వెంటనే తాగితేనే ఆరోగ్యానికి మంచిది. మజ్జిగలో నిమ్మరసం కలుపుకుని తాగితే మరింత మంచిది. మంచినీరులో నిమ్మరసంతో పాటు చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే ఎండాకాలం వేడి నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.
నిమ్మకాయలో సీ విటమిన్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఎన్నో రోగాల నుంచి రక్షణ కల్పిస్తుంది. బరువును తగ్గించే గుణాలు కూడా నిమ్మరసంలో ఉన్నాయి. నిమ్మరసం రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే త్వరగా బరువు కూడా తగ్గుతారని పలు పరిశోధనల్లో తేలింది. రక్తపోటును నియంత్రించడంతో పాటు ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడంతో ఉపయోగపడతాయి. నిమ్మకాయలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి, ఇవి గొంతు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అలాగే క్యాన్సర్ కారకాలు పెరగనీయకుండా నియ్మరసం కాపాడుతుంది.
చర్మంపై వచ్చే మెటిమలను కూడా తగ్గించి చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.నిమ్మ యాంటీసెఫ్టిక్‌గా పనిచేస్తుంది. దీని వల్ల శర్మంపై ముడతలు రాకుండా చేయడం, కాలిన మచ్చలను తొలగించడం, చర్మాన్ని కాంతివంతగా చేయడంలో నిమ్మ బాగా ఉపయోగపడుతుంది. ఇక పెరుగుతో నిమ్మరసాన్ని కలిపి జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య దూరమవుతుంది. తేనెతో కలిసి నిమ్మరసం తీసుకుంటే అజీర్తి సమస్య తొలగిపోతుంది. నోటి దుర్వాసనను పొగొట్టడంలో కూడా నిమ్మ చాలా ఉపయోగపడుతుంది.