Ginger Side Effects In Telugu : మన నిత్యజీవితంలో అల్లాన్ని కూరల్లో ఎక్కువగా వాడుతుంటాం. జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు కూడా దీనిని ఉపయోగిస్తుంటాం. అయితే మరీ ఎక్కువగా అల్లం వాడితే పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణ సంబంధిత సమస్యలు
అల్లం మన శరీరంలోని జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. అందువల్లనే చాలా మంది ఆరోగ్య రీత్యా దీనిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే ఇది అందరి విషయంలో ఒకేలా ఉండదు. పరగడుపున అల్లంను తీసుకుంటే జీర్ణాశయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుండెలో మంట, డయేరియా లాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందుకే అధికంగా అల్లాన్ని తీసుకోకపోవడమే ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అధిక రక్తస్రావం..
రక్తం పలుచన కాకుండా చేసే గుణాలు అల్లానికి ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేగాక అల్లం రక్త ప్రసరణను ప్రేరేపించి.. గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే పలు ఆరోగ్య సమస్యలుండి రక్తాన్ని పలుచనచేసే మందులను వాడుతున్నవారు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. అధిక మోతాదులో అల్లం తీసుకోవడం వల్ల రక్త స్రావం అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వారు అల్లం తక్కువగా తీసుకోవడమే ఉత్తమం
Side Effects Of Ginger : కొంత మంది మధుమేహం ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుందనే కారణంగా అల్లాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారని వైద్యులు అంటున్నారు. అయినప్పటికీ షుగర్ సంబంధిత మందులు వాడుతున్నట్లయితే జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. ఔషధాల ప్రభావాన్ని అల్లం పెంచవచ్చు లేదా తగ్గించవచ్చని చెబుతున్నారు.
అలెర్జీ, చర్మ సమస్యలు
అల్లం కొంతమందికి వరం.. మరికొందరికి శాపమని చెప్పవచ్చు. కొందరిపై అల్లం ప్రతికూల ప్రభావం చూపవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు. అల్లాన్ని మీరు తాకినపుడు శరీరంపై ఏవైనా దద్దుర్లు ఏర్పడితే ముందుగా ఆ భాగాన్ని శుభ్రపరచి వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు.