Dates Soaked In Ghee Benefits : ఉష్ణ మండల ప్రాంతాల్లో, ఎడారుల్లో లభించే ఫలాల్లో ఖర్జూరం ప్రధానమైనది. ఈ ఖర్జూరం పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఖర్జూర పండ్లలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఖర్జూరంలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో బి-కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్-కె, విటమిన్-ఏ, ఐరన్, డైటరీ ఫైబర్, పొటాషియం, కాపర్, మాంగనీస్, కాల్షియం లాంటి ఎన్నో రకాల విటమిన్లు ఉన్నాయి. ఖర్జూరం తినడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, రొమ్ము క్యాన్సర్, మలబద్ధకం లాంటి సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన దంతాలకు, చిగుళ్ల పరిరక్షణకు కూడా ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి.
మూలకాల గని!
ఖర్జూరాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్ మూలకాలు అధికంగా ఉంటాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఖర్జూరాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఖర్జూరంలో కొన్ని మినరల్స్, విటమిన్స్ మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ సూపర్ ఫుడ్‌ను ఎంత ఎక్కువగా తింటే, మన శరీరం అంత ఆరోగ్యంగా, శక్తివంతంగా తయారవుతుంది. పురాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో, ఖర్జూరాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా తెలిపారు. ముఖ్యంగా ఇవి సంపూర్ణ శారీరక శ్రేయస్సుకు ఎలా విధంగా ఉపయోగపడతాయో ఆయుర్వేద శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పారు.
నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరం!
ఆయుర్వేదాన్ని సంపూర్ణ ఆరోగ్యానికి మేలైన చికిత్స అందించే శాస్త్రంగా భారతీయులు భావిస్తారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, నెయ్యితో నానబెట్టిన ఖర్జూరాలు, మానవులకు ఎన్నో విధాలుగా మేలు చేస్తాయని చెప్పారు. కఫ, వాత, పిత్త సమస్యల నివారణకు నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాకుండా ఒత్తిడిని తగ్గించడానికి, ఆందోళన, గుండె దడ లాంటి సమస్యల నివారణకు కూడా నెయ్యి ఖర్జూరం మిక్స్ ఉపకరిస్తుందని స్పష్టం చేసింది. ఎముకలు పటిష్ఠంగా ఉండడానికి, గుండె ఆరోగ్యానికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయని వివరించింది.
రోగనిరోధకశక్తి పెరుగుతుంది!
నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. సెక్స్ సామర్థ్యాన్ని కూడా ఇది బాగా పెంచుతుంది. అంతేకాదు మన శరీరంలోని క్షీణించిన కణజాలాలను మరలా రిపేర్ చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే, ఖర్జూరాలను తినడం వల్ల మంచి ఆరోగ్యం, రోగ నిరోధకశక్తి, సమతుల్య మానసిక స్థితి, మంచి నిద్ర కలుగుతాయి.
ఎనర్జీ బూస్ట్
ఖర్జూరంలోని సహజ చక్కెరలు, నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కలిసి, మానవులకు స్థిరమైన శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ లాంటి సహజ చక్కెరలు మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరం సులభంగా జీర్ణమవుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేసే శక్తి కూడా దీనికి ఉంటుంది. ఈ పండ్లలో ఫైబర్ కూడా మంచి శక్తిని అందిస్తుంది.
జీర్ణ ప్రక్రియకు మేలు
నెయ్యిలో ఉండే ఎంజైమ్‌ల వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నివారణ అవుతుంది. నెయ్యిలో ఉండే కొవ్వులు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలతో సహా, పలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను శుద్ధి చేసి, మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తాయి.
రోజూ ఖర్జూరం తింటే పెద్ద ప్రేగులు శుభ్రం అవుతాయి. రొమ్ము క్యాన్సర్, గుండె జబ్బులు దరికిరావు. మధుమేహం నుంచి రక్షణ పొందవచ్చు. పైగా మంచిగా రక్త ప్రసరణ జరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. సంతానలేమి సమస్య నివారణ అవుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, గర్భిణులు ఖర్జూరం తింటే, ఆరోగ్యపరంగా ఎంతో మేలు కలుగుతుంది అని తేలింది. ముఖ్యంగా ఖర్జూరం తినడం వల్ల గర్భాశయం ఆరోగ్యంగా, మృదువుగా తయారవుతుంది. ఫలితంగా సుఖ ప్రసవం జరగడానికి అవకాశం పెరుగుతుంది.