హెయిర్ స్టైల్‌గా ఉండటానికి యూత్ తెగ ఆరాటపడుతుంటారు. జుట్టు నల్లగా ఉంటేనే అందం అని చాలా మంది భావిస్తారు. జుట్టు తెల్లబడటం మొదలుపెడితే మానసికంగా కుంగిపోయేవారున్నారు. జుట్టు తెల్లబడటం అనేది ఈరోజుల్లో అరుదైన సమస్య కాదు. చాలా మందికి జుట్టు నెరవడం సాధారణం అయిపోయింది. దీంతో జుట్టుకి రంగులు వేయడం చేస్తుంటారు. ఇరవై ఏళ్ల కంటే వయసు తక్కువ ఉన్నవారి జుట్టు తెల్లబడితే వారిని కెనాయిటిస్ బాధితులుగా చెబుతారు వైద్యులు. జుట్టు తెల్లబడటానికి చాలా కారణాలున్నాయంటున్నారు డాక్టర్లు.
- కొందరికి జన్యుసంబంధమైన కారణాలు.
- పోషకాల లోపం.
- హార్మోన్లలో అసమతుల్యత వల్ల హిమోగ్లోబిన్, ప్రొటీన్ లోపంతో కూడా జుట్టు తెల్లబడే అవకాశం ఉంది
"చాలా మందికి చిన్న వయసులోనే తెల్లజుట్టు అనేది వస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉన్నా కూడా, విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా తెల్లజుట్టు అనేది వస్తుంది. విటమిన్, సెలీనియం, క్రోమియం, మైక్రో న్యూట్రియెంట్ డెఫిషియెన్సీ వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. జుట్టుకు రసాయనాలను వాడటం, పొల్యూషన్ వల్ల జుట్టు పాడవటం, తెల్లజుట్టు రావడం లాంటివి జరుగుతుంది. స్మోకింగ్ కూడా జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. డెఫిషియెన్సీ ఉంటే అవి ఏ పదార్థాలలో ఉంటుందో తెలుసుకొని వాటిని తీసుకోవాలి. మైల్డ్ షాంపులు వాడాలి."
-డా.పద్మావతి, డెర్మటాలజిస్ట్
ఒత్తిడి
దీర్ఘకాలం పాటు ఒత్తిడిని అనుభవిస్తే అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించడం వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడు ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. క్రమక్రమంగా వెంట్రకులు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.
సరైన విటమిన్లు అవసరం
శరీరంలో అవసరమైన విటమిన్లు లేకపోవడం జుట్టు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఫోలిక్ ఆసిడ్, బయోటిన్ వంటి పోషకాల లోపంతో జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. ఈ పోషకాల లోపాన్ని తీర్చడానికి గుడ్లు, డైరీ ఉత్పత్తులు, మాంసం వంటి ముఖ్యమైన ఆహారాలను తీసుకోండి.
ధూమపానం
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. ఈ అలవాటు ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యాన్ని దారుణంగా ప్రభావితం చేస్తుంది. అయితే ఈ పొగతాగే అలవాటు చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా హానికరం. సిగరెట్లలో ఉండే టాక్సిన్స్ వెంట్రుకల కుదుళ్లను దెబ్బతీస్తాయి. దీంతో జుట్టు తెల్లబడుతుంది. రసాయనాలతో నిండిన యాంటీ డాండ్రప్ షాంపులు వారంలో రెండు సార్లకు మించి వాడకపోవడం మంచిదంటున్నారు వైద్యులు.
రసాయనాలు వాడకూడదు
రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. హెయిర్ ప్రొడక్ట్‌లలో ఉండే సల్ఫేట్లు కొన్ని ప్రయోజనాలను చేకూర్చినప్పటికీ వీటివల్ల జుట్టు పొడిబారి త్వరగా పాడయిపోయేలా చేస్తాయి. హెయిర్ స్ట్రైట్నింగ్, స్ప్రేలు, హెయిర్ గ్లోయింగ్ వంటి చికిత్సల వల్ల వెంట్రుకలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఈ చికిత్సలు తరచుగా చేయించుకోవడం వల్ల చికిత్సల ప్రభావంతో వెంట్రుకలు తెల్లబడే అవకాశం లేకపోలేదు. సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉంటమే ఆరోగ్యానికి మేలు.