Best Ways To Build Trust In Parent Child Relationship : చిన్నప్పటి నుంచే పిల్లలకు తల్లిదండ్రులు మంచి అలవాట్లను నేర్పిస్తే, వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలను వెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకోసం తల్లిదండ్రులు వారితో స్నేహంగా మెలగడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేలా చేయడం వంటివి చేయాలి. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు. కాబట్టి, వారితో నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకమే పిల్లలకు, తల్లిదండ్రుల మధ్య బలమైన బంధంగా మారుతుంది. తల్లిదండ్రులపై పిల్లలు నమ్మకంగా ఉంటే వారి ఇష్టాఇష్టాలను, కలలను, వారికి ఉన్న సందేహాలను అడుగుతారు. దీనివల్ల మీ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడంలో సహాయ పడుతుంది. మీరు పిల్లలతో ఎంత స్నేహపూర్వకంగా మెదిలితే వారు మీతో అన్ని విషయాలను పంచుకుని, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో నమ్మకంగా ఉండటానికి చేయాల్సిన ఆరు విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Ways To Build Trust With Parents : 1. శ్రద్ధగా వినండి :
పిల్లలు మీతో ఏదైనా విషయం చెప్పడానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు, చికాకుగా మాట్లాడకుండా.. వారిని ప్రేమతో దగ్గరికి తీసుకోండి. వారి కళ్లలోకి సూటిగా చూస్తూ.. చెప్పే విషయాలను పూర్తి శ్రద్ధతో వినండి. వారు చెప్పే విషయాలను బట్టి చిన్న చిన్న ప్రశ్నలను వేసి వారితో కలిసిపోయి మాట్లాడండి. దీనివల్ల పిల్లలు మీరు వింటున్నారు, అని అర్థం చేసుకుని మరిన్ని విషయాలను మీతో పంచుకుంటారు. ఇలా చేయడం వల్ల చిన్న వయస్సులోనే పిల్లలకు మీపై నమ్మకం కుదురుతుంది.
Best Ways to Avoid Stress in Children : పిల్లల్ని ఓ కంట కనిపెడుతున్నారా..?
2. నిజాయితీగా ఉండండి :
మీరు పిల్లలతో ఎల్లప్పుడు నిజాయితీగా ఉండండి. కష్టమైన సమయంలో కూడా వారికి అబద్ధాలు చెప్పకుండా నిజాలే చెప్పండి. మీకు సమాధానం తెలియక పోతే తెలియదని చెప్పండి. అంతేగానీ తాత్కలికంగా వారికి అబద్ధం చెప్పి సంతోష పెట్టినా, నిజం తెలిసిన రోజు వారికి మీపై నమ్మకాన్ని కలిగించలేరు.
3. హద్దులను గౌరవించండి :
కుటుంబ సభ్యులు, స్నేహితులతో పిల్లలు మర్యాదగా నడుచుకోవాలంటే.. ముందుగా పెద్దవాళ్లు ఒకరినొకరు హద్దుల్లో ఉండి పరస్పరం గౌరవించుకోవాలి. ఇంట్లో భార్యభర్తలు పిల్లల ముందు గొడవలు పడకుండా, సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇంట్లో ఎవరిదో ఒకరిది పెత్తనం నడవకుండా, ప్రతీ వ్యక్తి వ్యక్తిగత అంశాలను గౌరవించాలి. అప్పుడే పిల్లలు అందరితో మర్యాదగా ఉంటూ, నమ్మకంగా ఉంటారు.
4. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి :
పిల్లలు తల్లిదండ్రులతో చెప్పే విషయాలను చాలా మంది పట్టించుకోరు. వారి నిర్ణయాలను విలువ ఇవ్వకుండా, నీకు ఏం తెలియదు, మాట్లాడకు అని కసురుకుంటారు. దీనివల్ల పిల్లలు తమ మాటలకు గౌరవం ఇవ్వడం లేదని భావించి మీతో అన్ని విషయాలను పంచుకోక పోవచ్చు. అందుకే పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని స్థిరమైన నిర్ణయాలను తీసుకోండి. వారి ఆలోచనలను స్వాగతించండి.
5. స్వేచ్ఛా ఇవ్వండి :
ఎదిగే పిల్లలతో కఠినంగా ఉంటే వారికి క్రమశిక్షణ అలవడుతుందని కొందరు భావిస్తారు. అది అపోహ మాత్రమే. మితిమీరిన స్వాతంత్య్రం, ఆంక్షలు రెండూ ప్రమాదమే. అందుకే వారి వయస్సుకు తగినట్టు నిర్ణయాలను తీసుకోవడంలో సహయం చేయండి. ఎలాగంటే వారికి నచ్చిన బట్టలను, బొమ్మలను కొనివ్వడం చేయండి. చిన్నవయస్సులోనే నిర్ణయాలను తీసుకోవడం నేర్పిస్తే భవిష్యత్తులో వారే ముందుకు కొనసాగుతారు.
6. విజయాలను కొనియాడండి :
మీ పిల్లలు ఏదైనా పోటీల్లో గెలుపొందితే వారిని మెచ్చుకోండి. విఫలం అయినా తిరిగి ధైర్యంగా ప్రయత్నించమని ప్రోత్సహించండి. విజయానికి గుర్తుగా బహుమతులను అందించండి. దీనివల్ల పిల్లలు మీరు తమవైపు ఉన్నారని బలంగా నమ్ముతారు.