Best Food For Constipation : ఈ రోజుల్లో చాలా మంది బీపీ, షుగర్ జబ్బులతో పాటు, కనిపించని మలబద్ధకం సమస్యతో కూడా బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్న వారు తమ బాధను చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. వైద్యుల వద్దకు కూడా వెళ్లకుండా.. మెడికల్ షాప్‌లో లభించే మందులతో నెట్టుకొస్తుంటారు. అయితే.. ఈ సమస్యతో బాధపడేవారు దీర్ఘకాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని పలు అధ్యయనాలు, వైద్యులు వెల్లడిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దీర్ఘకాలికంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారిలో గుండె సంబంధిత సమస్యలు పెరిగినట్లు 2021 డిసెంబర్లో హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనలో మలబద్ధకం వల్ల గుండె ప్రభావితం అవుతుందని పరిశోధకులు చెప్పారు. అలాగే మన జీర్ణ వ్యవస్థపై కూడా మలబద్ధకం కొంత ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమలేని ఉద్యోగం వంటి తదితర కారణాలతో చాలా మందిలో మలబద్ధకం సమస్య ఎదురవుతుంది. దీనివల్ల శరీరంలో విషపదార్థాలు బయటకి పోకుండా ఉండటంతో, అవి గుండె వ్యవస్థపై ప్రభావితం చేసి వాపును కలుగజేస్తాయని వైద్యులు, పరిశోధకులు అంటున్నారు.
మలబద్ధకం సమస్య ఎందుకు వస్తుంది ?
- మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
- అలాగే నీరు తక్కువగా తీసుకోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
- మానసిక ఆరోగ్య పరిస్థితుల కోసం వాడే మందులు, డిప్రెషన్, ఆందోళన, హైపోథైరాయిడిజం వంటి వాటికి ఉపయోగించే మెడిసిన్ కూడా మలబద్ధకం సమస్యను కలుగజేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
- క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులు సైతం మలబద్ధకానికి దారితీస్తాయి.
- వీటన్నింటితోపాటు శారీరక శ్రమ చేయకుండా, సమతుల ఆహారం తీసుకోకుండా, మానసిక ఒత్తిడికి గురైతే కూడా మలబద్ధకం సమస్య వేధిస్తుంది.
కళ్లలో ఈ లక్షణాలు - చూపు కోల్పోవడం ఖాయం - బీకేర్ ఫుల్!
ఇలా చేస్తే మలబద్ధకం సమస్య దూరం!
రోజూవారి ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యను దూరం చేసుకోవచ్చు.
- బొప్పాయి, పైనాపిల్, యాపిల్, బెర్రీలు.
- బాదం, జీడిపప్పు, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలు.
- బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యారెట్లు, బీన్స్, బఠానీలు వంటివి తీసుకోవాలి.
ఎక్కువగా నీళ్లు తాగాలి..
మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రోజు మొత్తంలో తప్పకుండా కనీసం 8 గ్లాసుల నీళ్లను తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణమై సమస్య తగ్గుతుందని చెబుతున్నారు.
వ్యాయామం..
ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగ, వ్యాపార పరిస్థితుల వల్ల కూర్చికే పరిమితమై కూర్చుంటున్నారు. దీనివల్ల కూడా మలబద్ధకం వేధిస్తుంటుంది. కాబట్టి, రోజు కొంత సమయం శారీరక శ్రమ కలిగించే నడక, పరుగు చేయాలని వైద్యులు చెబుతున్నారు.
పేగుల ఆరోగ్యానికి మంచి బ్యాక్టీరియా..
మనం తినే ఆహారం సులభంగా జీర్ణమవడానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలు పేగుల్లో ఉంటాయి. వీటిని ప్రోబయోటిక్స్ అంటారు. ఇవి ఎక్కువగా ఉండే పెరుగును రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వైద్యులంటున్నారు.
హెపటైటిస్ ప్రమాదం - క్యాన్సర్‌గా మారే వరకు లక్షణాలు కనిపించవు - ఇలా అడ్డుకోవాల్సిందే!
అలర్ట్ - రాత్రివేళ బెడ్ ఎక్కి ఫోన్ పట్టుకుంటున్నారా? మీ మెదడులో జరిగే ప్రమాదకర మార్పులివే!