Banana Health Benefits : అరటిపండు.. పెద్దగా పరిచయం అవసరంలేని ఫలం. తక్కువ ధరలో అన్ని చోట్లా, అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. చిన్న పిల్లలు మొదలు పండు ముసలి వాళ్లు తినేందుకు అనువుగా ఉంటుంది. ఇది మనకు ఆరోగ్య పరంగా చాలా మేలు చేస్తుంది. సక్రమమైన జీర్ణక్రియ నుంచి గుండె ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. ఇందులో అనేక రకాల పుష్కలమైన పోషక విలువలుంటాయి.
అరటిపండులో పిండి పదార్థాలు, నీటి శాతం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు తగిన మోతాదులో ఉంటాయి. కొంత మేర ప్రోటీన్ ఉండగా.. కొవ్వు మొత్తానికే ఉండదు. సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పండును మన దిన చర్యలో భాగం చేసుకోవడం వల్ల, శరీరానికి రోజంతా కావాల్సిన శక్తి, పోషకాలు లభిస్తాయి. దీనితో పాటు అనేక రకాల ఆరోగ్య లాభాలను కూడా పొందవచ్చు. అవేంటంటే..
పోషకాలు.. పుష్కలంగా!
అరటి పండు పోషకాలకు పెట్టింది పేరు. ఇందులో విటమిన్ - సి, విటమిన్ - B6, పొటాషియం, మాంగనీస్ సహా అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ మన రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే జీవక్రియ సక్రమంగా పనిచేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
శక్తిని పెంపొందిస్తుంది!
Banana Benefits For Men : అరటిపండ్లు.. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలకు మూలం. ఈ చక్కెరలు మన శరీరానికి త్వరితగతిన స్థిరమైన శక్తిని అందిస్తాయి. జిమ్ చేసేవాళ్లు, ఆటలాడేవాళ్లు ఎక్కువగా అరటి పండ్లు తీసుకుంటారు. ముఖ్యంగా జిమ్ చేసేవాళ్లు వ్యాయామానికి ముందు వీటిని తింటారు.
జీర్ణక్రియ పనితీరు సక్రమంగా!
అరటిపండ్లలో ఫైబర్ ముఖ్యంగా పెక్టిన్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సాయపడతాయి. అంతేకాకుండా పేగు కదలికల్ని నియంత్రిస్తాయి. అరటిపండ్లను క్రమం తప్పకుండా తినడం వల్ల మలబద్ధక సమస్య కూడా తీరుతుంది. జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగవుతుంది.
గుండె మరింత పదిలం!
అరటిపండ్లలోని పొటాషియం స్థాయులు రక్తపోటును నియంత్రించడంలో దోహదపడతాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా సోడియం ప్రతికూల ప్రభావాలను నిరోధిస్తుంది. ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయులను నిర్వహించడంలో కీలక పాత్ర వహిస్తుంది.
మానసిక స్థితి మెరుగ్గా!
అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని నియంత్రించే సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్కు పూర్వగామి. రోజూ అరటిపండ్లు తీసుకోవడం వల్ల సెరోటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా మానసిక స్థితిని మెరుగుపడుతుంది. దీనితో నిరాశ, ఆందోళనలకు దూరంగా ఉంటారు.