ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవం నేడు. అడుగడుగునా అనవసరంగా టెన్షన్ పడితే అది హైపర్‌టెన్షన్ మారిపోతుంది. అదే అధిక రక్తపోటుకు దారితీస్తుంది. ఈ ప్రాణాంతక పోటు మనిషి జీవితాన్ని కలవరపెట్టకుండా చూసుకునేందుకు ఏటా మే 17న హైపర్‌టెన్షన్ డే జరుపుకుంటారు.
ప్రపంచమంతా ఇదే టెన్షన్...
ప్రపంచ హైపర్‌టెన్షన్ డే 2005, మే 17న ప్రారంభమైంది. మనకు తెలియకుండానే మన మనసును కుంగదీసే ఈ అధిక ఒత్తిడి, దాని ద్వారా వచ్చే అధిక రక్తపోటు(హైబీపీ) గురించి అవగాహన కల్పించి.. దానిని తరిమికొట్టేందుకు ప్రయత్నించడమే ఈ హైబీపీ డే ముఖ్య ఉద్దేశం.
ప్రపంచంలో సంభవిస్తున్న అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో గుండె జబ్బు ఒకటి. ఆ గుండెపోటుకు దారితీసేది అధిక రక్తపోటేనని ఓ సందర్భంలో హైబీపీ గురించి వర్ణించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 113 మంది హైబీపీతో బాధపడుతున్నారు.
అసలు కారణం ఇదే..
హైపర్ టెన్షన్ కేవలం రక్తపోటునే కాదు... కిడ్నీ సమస్య, కంటి చూపు కోల్పోవడం, గుండెపోటు, అకాల మరణాలకూ కారణమవుతోంది. అందుకు అసలు కారణాల..
- ఆహారంలో మితిమీరి ఉప్పు తీసుకోవడం
- అతిగా కొవ్వు పదార్థాలను తీసుకోవడం
- తగిన శారీరక వ్యాయామం లేకపోవడం
- మితిమీరిన ఒత్తిడి
- అతిగా తాగడం, ధూమపానం
- వంశపారంపర్యంగా సంక్రమించడం
లక్షణాలు కనబడవ్..
అధిక రక్తపోటు ఉన్నప్పటికీ చాలామందిలో ఇది ఒక్కోసారి ప్రాణం మీదకు వచ్చేవరకు బయటపడదు. కాలానుగుణంగా వైద్య పరీక్షలు చేయడం వల్లే అది బయటపడుతుంది.
అయితే తీవ్రత పెరిగే కొద్దీ తెల్లవారుజామున తలపోటు, ముక్కులోంచి రక్తం రావడం, గుండె చప్పుడులో మార్పు, కంటి చూపు సమస్య, చెవులు ఝుమ్మనడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తపోటు మరీ ఎక్కువైతే ఛాతీలో నొప్పి, అలసట, వికారం, వాంతులు, గందరగోళం, ఆందోళన, వణుకు వంటి లక్షణాలు బయటపెడతాయి.
ఇలా నివారించుకోవచ్చు...
- ఆహారంలో తీసుకునే రోజువారీ ఉప్పు పరిమాణం 5 గ్రా. కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
- ఆహారంలో కొవ్వు పదార్థాలు పరిమితి మించకుండా చూసుకోవాలి.
- క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేస్తూ ఉండాలి.
- అధిక బరువు ఉంటే తగ్గించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- పొగతాగే అలవాటు ఉంటే పూర్తిగా మానేయాలి.
- మద్యం తాగే అలవాటు ఉంటే మోతాదు మించకుండా చూసుకోవాలి.
- రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి.
- అధిక రక్తపోటు ఉంటే వైద్యుల సలహాపై తగిన మందులు తీసుకోవాలి.
ఇదీ చదవండి:వలస కూలీలను ఫోన్ నంబర్‌తో పట్టేస్తారు.!