కొద్దిరోజులుగా అందరినోటా వైరస్ మాట. అసలు ఈ వైరస్ అంటే ఏమిటి? అవి ఎలా ఉంటాయి? వాటిపై ఓ లుక్కేస్తే...
పెద్దా.. చిన్నా..
ప్రపంచంలోనే అతిపెద్ద వైరస్ పేరు మిమివైరస్. దీని వ్యాసం 400 నానోమీటర్లు (అంటే 0.0004 మిల్లీమీటర్లు). ఇది 900కుపైగా ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని రకాల బ్యాక్టీరియాల కన్నా పెద్దది. అత్యంత చిన్న వైరస్ పేరు సిర్కోవైరస్. దాని వ్యాసం 20 నానోమీటర్లు (0.00002 మిల్లీమీటర్లు) రెండు ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది.
ఒక ఫ్లూ = 100 లక్షల కోట్ల వైరస్‌లు
ఒక వ్యక్తి ఫ్లూ బారినపడితే అతడి శ్వాస నాళాల్లో ఇన్‌ఫెక్షన్ సోకిన ప్రతి కణమూ దాదాపు 10వేల కొత్త వైరస్‌లను ఉత్పత్తి చేస్తుంది. కొద్దిరోజుల్లోనే అతడి శరీరంలో 100 లక్షల కోట్ల వైరస్‌లు రావొచ్చు. మొత్తం మానవ జనాభాతో పోలిస్తే ఇది కొన్ని వేల రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఒక మిల్లీ లీటరు సముద్ర నీటిలోనే ఒక లక్ష వైరస్ రేణువులు ఉంటాయి.
పేర్లు లేనివెన్నో...
ఇప్పటివరకైతే 6,828 వైరస్ జాతులకే పేర్లు పెట్టారు. ఇంకా లక్షల్లో వైరస్‌లకు పేర్లు పెట్టాల్సి ఉంది. తొలిసారిగా గుర్తించిన మానవ వైరస్ పేరు ఎల్లో ఫీవర్. 1901లో వాల్టర్ రీడ్ దీన్ని కనుగొన్నారు. వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు కింద చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి.
ఉపయోగాలూ ఉన్నాయ్
వైరస్‌లలో మానవాళికి ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి. అవి జన్యు, రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై పరిశోధనలకు, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు, క్యాన్సర్లపై అవగాహన, చికిత్సకూ ఉపయోగపడుతున్నాయి. కొన్ని వైరస్‌లను బ్యాక్టీరియా కారక ఇన్‌ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. నానో టెక్నాలజీలో, జన్యు మార్పిడి పంటల్లో నిర్దిష్ట అంశాలను మోసుకెళ్లే వాహకాలుగానూ సాయపడుతున్నాయి. గర్భంలో తల్లి రోగ నిరోధక వ్యవస్థ... శిశువుపై దాడి చేయకుండా కొన్ని రకాల వైరల్ ప్రొటీన్లు కాపాడతాయి. హెచ్‌టీఎల్‌వీ అనే ఒక వైరస్ వేల సంవత్సరాలపాటు మానవులతో కలిసి సాగింది. తొలినాళ్లలో మానవుల వలస పోకడలను వెలుగులోకి తీసుకురావడానికి ఇది ఇప్పుడు సాయపడుతోంది.
ఇదీ చదవండి: 'గల్ఫ్ దేశాల వారిని వెనక్కి తెచ్చే సమయం కాదిది!'