కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో తమ భూభాగంపై ఉన్న విదేశీయులు వెళ్లిపోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది. గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు ఉపాధి పొందుతుంటే.. వారిలో 30 లక్షల మంది ఒక్క యూఏఈలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గల్ఫ్‌లో కరోనా సంక్షోభం, నిరుద్యోగ సమస్యతో భారత్‌పై పడే ప్రభావాన్ని గతంలో యూఏఈలో భారత రాయబారిగా పనిచేసిన నవదీప్ సింగ్ సూరి విశ్లేషించారు. ఆయన 'ఈటీవీ భారత్ ప్రతినిధి' స్మితా శర్మతో మాట్లాడుతూ కరోనా సంక్షోభం వేళ భారత్ ఎదుట ఉన్న మార్గాలను వివరించారు. గల్ఫ్ నుంచి మనవాళ్లను వెనక్కి తేవడానికి ఇది సమయం కాదన్నారు.
- గల్ఫ్ దేశాల్లో ఉంటున్న కార్మికులు ఇప్పుడు ఎటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు?
గల్ఫ్‌దేశాల్లో వేర్వేరు పాలనా వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా కారణంగా సంక్షోభం తలెత్తినట్లు నివేదికలు రాలేదు. అవసరమైన వారికి వైద్యసౌకర్యాలు అందిస్తామని చెబుతున్నాయి. కాకపోతే, ఉపాధి కోల్పోయిన కార్మికులను స్వదేశాలకు పంపించాలని భావిస్తున్నాయి. కరోనా సంక్షోభాన్ని తమదైన శైలిలో ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.
- కొవిడ్ బారిన పడిన భారతీయులకు ఔషధాల కొరతను తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
అక్కడున్న మన రాయబారులు, కాన్సుల్ జనరల్స్‌తో ప్రభుత్వం తరచూ సంప్రదింపులు జరిపి అవసరమైన వారిని గుర్తించి సాయం అందజేయాలి. అక్కడి ప్రభుత్వాలతో కలిసి పనిచేసే సామాజిక సంఘాలతో ఒక నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేయాలి. ప్రాథమికంగా వారి బాధ్యత అక్కడున్న ప్రభుత్వాలు, వారు పనిచేసే యజమానులదే. అవసరమైతే మన దౌత్య కార్యాలయం జోక్యం చేసుకోవాలి.
- వివిధ దేశాలు తమ భూభాగం నుంచి పౌరులను వెనక్కి తీసుకోవాలని యూఏఈ హెచ్చరిస్తోంది. భారతీయులు అక్కడ ఎన్నాళ్లపాటు ఉండొచ్చు?
యూఏఈ ప్రభుత్వం వాడిన భాషను చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. పర్యాటక వీసాలపై వెళ్లి నిలిచిపోయినవారు, గడువు ముగిసిన వీసాదారులను తీసుకెళ్లే అంశం గురించే ఇదంతా. అంతేకానీ, అక్కడ వర్క్ వీసాలు, ఇతర వీసాలతో ఉన్నవారికి ఇబ్బంది ఉండదు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కూడా 'స్వల్పసంఖ్యలో వ్యక్తులు' అని పేర్కొనడం వెనుక అర్థం ఇదే.
- అక్కడ చిక్కుకున్న భారతీయులు కరోనా వ్యాప్తి సమయంలో రద్దీగా ఉండే ప్రదేశాల్లో జీవిస్తున్నారు. ఇది మరింత ప్రమాదకరం కాదా?
ఒక విమానంలో సగటున 180 మందిని తీసుకురావచ్చు. గల్ఫ్‌దేశాల్లో 90 లక్షల మంది ఉన్నారు. మీరు ఆలోచించండి వాస్తవంగా ఇది సాధ్యమా..? అంతమందిని ఇక్కడ క్వారంటైన్ చేయగలమా..? ఈ స్థితిలో ఎక్కడ ఉన్నవారిని అక్కడే ఉంచి సంరక్షించడం ఉత్తమం. వెనక్కి తెచ్చే సమయం కాదిది. ఈ సంక్షోభంలో చాలా మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయిన మాట వాస్తవమే. అలాంటి వారిని మరో ఉద్యోగం దక్కించుకొనే వరకు జాగ్రత్తగా కాపాడేందుకు చర్యలు చేపట్టడమో.. వాపస్ తీసుకురావడమో చేయాలి. భారత దౌత్యకార్యాలయం ఆ దిశగా చర్యలు చేపట్టింది.
- ఈ పరిణామాలు గల్ఫ్ దేశాల్లోని ప్రవాసుల నుంచి భారత్‌కు వచ్చే సంపదపై ప్రభావం చూపిస్తాయా?
కేరళ నుంచి వెళ్లిన ప్రజలు ఎక్కువగా గల్ఫ్‌దేశాల్లో ఉంటున్నారు. ఆ తర్వాత స్థానాల్లో బిహార్, యూపీ, తెలంగాణ ఉన్నాయి. గతేడాది ఒక్క యూఏఈ నుంచే 17 బిలియన్ డాలర్ల సొమ్ము భారత్‌కు రాగా.. గల్ఫ్‌దేశాల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు వచ్చింది. ఇది మన జీడీపీలో 2 శాతానికి సమానం. అక్కడ ఉద్యోగాలు కోల్పోయిన వారు తిరిగివచ్చే అవకాశం ఉంది.
- కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనే క్రమంలో హజ్‌యాత్రలో సౌదీ ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా?
సౌదీ, యూఏఈ, ఈజిప్టులు కరోనావైరస్‌ను అడ్డుకొనేందుకు చాలా ముందుగానే చర్యలు తీసుకొన్నాయి. చివరికి మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలను కూడా అనుమతించలేదు. 'ప్రార్థనలకు రండి' అని కాకుండా.. 'ఇంటి వద్దే ఉండి ప్రార్థించండి' అని పిలుపునిస్తున్నారు. 'హజ్' అత్యంత కీలకమైన వార్షిక కార్యక్రమం. గతంలో యుద్ధసమయాల్లో కూడా దీనిని కొనసాగించారు. అందుకే సౌదీ దీనిపై స్పందిస్తూ.. హజ్‌ను రద్దుచేస్తే అది చాలా పెద్ద నిర్ణయమే అవుతుంది అని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడే దీనిపై ఏమీ ఊహించలేం.
ఇదీ చదవండి: వుహాన్ డైరీలో నమ్మలేని నిజాలు?