YSRCP Government Closing Andhra Fish Scheme : వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఫిష్ ఆంధ్రా హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం జగన్ ప్రగల్బాలు పలికారు. పులివెందులలో ఫిష్ ఆంధ్రా హబ్ వస్తుందని జగన్ ఊహించలేదట! ఆయన ఊహల్లో విహరించబట్టే పులివెందులలో ఫిష్ ఆంధ్ర హబ్ ఫినిష్ అయింది. దేశంలోనే మొదటి ఆక్వా హబ్ అంటూ ఆర్భాటం చేసినా అది 5నెలలకే అది మూతబడింది.
Andhra Fish Scheme in AP : కాకినాడ, విశాఖ విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో పెంచుతున్న చేపలు తెచ్చి ఈ హబ్ లో నిల్వ చేయాల్సి ఉంది. అందుకోసం జర్మనీ నుంచి సాంకేతిక ఐస్ యంత్రాలు తెచ్చారు. కానీ అవి మొదట్లోనే మొరాయించాయి. ఫలితంగా చేపల నిల్వకు అవకాశం లేక మొత్తానికే దుకాణం సర్దేశారు.
జగన్ ఇలాకాలోనే ఫిష్ ఆంధ్రా హబ్‌మూతేస్తే ఇక ఇతర ప్రాంతాల గురించి చెప్పేదేముంది? ఇది కడప కలెక్టరేట్ సమీపంలో ఇటీవలే ఏర్పాటు చేసిన ఫిష్ ఆంధ్ర హబ్. ఇక్కడ బోర్డులో తప్ప దుకాణంలో సరుకు అంతగా ఉండదు. దీన్నో టీస్టాల్ తరహాలో నడిపిస్తున్నారు. అనంతపురం జిల్లాలోనూ అదే పరిస్థితి! ఎప్పట్నుంచో నడుస్తున్న దుకాణాలకు ఫిష్ ఆంధ్ర బోర్డులు పెట్టేసి ప్రభుత్వం పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. 2022 ఏప్రిల్ నుంచి చేపల సరఫరా ఆగిపోయింది.
సరఫరాదారుల్ని ఒప్పించలేక మత్స్యశాఖ అధికారులూ చేతులెత్తేశారు. నిర్వాహకులు దూరప్రాంతం నుంచి చేపలు, రొయ్యలు కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సి వస్తోంది. రవాణా, సిలిండర్లు, ఇతర ఖర్చులు భారంగా మారుతున్నాయి. బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ ధరలకు అమ్మితే తప్ప గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. లేదంటే స్థానికంగా దొరికే చేపల మార్కెట్ల నుంచే కొనుగోలు చేసుకోవాలి! ఫలితంగా ఆదివారం మాత్రమే వ్యాపారం చేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ఫిష్ ఆంధ్ర దుకాణాలు ఎందుకు పెట్టామా అని నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు.
చేపలు, రొయ్యల ఎగుమతులకు గడ్డు పరిస్థితులు ఎదురవడంతో రైతులకు ధరలు దక్కడం లేదు. ఆ పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం స్థానికంగా వినియోగం పెంచుతామంటూ తెరపైకి తెచ్చిందే ఫిష్ ఆంధ్ర. 558 కోట్లతో 70ఆక్వా హబ్‌లు, 14వేల రిటైల్ ఔట్‌లెట్లు ఏర్పాటు చేస్తామని, తద్వారా సుమారు 80వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. సముద్రతీర ప్రాంతాల నుంచి చేపలు తెచ్చి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే ఫిష్ హబ్‌లలో నిల్వచేస్తారు. అక్కడి నుంచి జిల్లాలో ఏర్పాటయ్యే ఔట్‌లెట్‌లకు పంపిణీ చేసి ప్రజలకు విక్రయించాలి. కానీ ప్రభుత్వం లెక్క తప్పింది.
Pulivendula Fish Hub: 'ఫిష్ ఆంధ్రా' ఆక్వా హబ్‌కు ఆదిలోనే ఆటంకాలు..!
2023 మార్చి నాటికి హబ్‌లు, రిటైల్ ఔట్‌లెట్లూ కలిపి 4వేల వరకూ ఏర్పాటు చేయాల్సి ఉంది. గతేడాది మే 15న జరిగిన ఆక్వా సాధికార కమిటీ సమావేశంలో 1549 ఫిష్ ఆంధ్ర కేంద్రాలు ఏర్పాటయ్యాయని అధికారులు ప్రకటించారు. వాస్తవానికి పూర్తైంది 1,127 నిర్మాణాలే. అందులోనూ 90 శాతం మూతపడ్డాయి. కొన్నిచోట్ల ప్రారంభమే కాలేదు. చాలాచోట్ల మిని రిటైల్ ఔట్‌లెట్లూ నెలల తరబడి మూసివేసే ఉంటున్నాయి. లక్ష్యాలు పూర్తి చేయాలనే ఆలోచనతో రోడ్డుపక్కన బడ్డీ దుకాణాలు, చిల్లరకొట్లకూ అధికారులు ఫిష్ ఆంధ్ర బోర్డులు పెట్టిస్తున్నారు. ఈపాటి దానికి దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఫిష్ ఆంధ్ర హబ్‌లు ఏర్పాటు చేస్తామని జగన్ ప్రగల్బాలు పలికారు..