Pawan Kalyan visits Galiveedu MPDO at Kadapa RIMS: వైఎస్సార్సీపీ నాయకులు ఇంకా అధికారం మదంతో తల పొగరు నెత్తికెక్కి వ్యవహరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై వారి పొగరు దించి తాట తీసి కింద కూర్చోబెడతామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి దాడి చేయడాని పవన్ కల్యాణ్ ఖండించారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న జవహర్ బాబును పవన్ కల్యాణ్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
రాయలసీమలో వైఎస్సార్సీపీ నాయకులకు అధికారులపై దాడి చేయడం పరిపాటిగా మారిందని ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటివి పునరావృతం అయితే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఎంపీడీవోపై దాడి చేసిన వైఎస్సార్సీపీ నేతకు ఎలాంటి కఠిన శిక్షలు పడాలో కూటమి ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. దళితుడైన ఎంపీడీవోపై వైఎస్సార్సీపీ నాయకులు దాడి చేశారంటే ఏమనుకోవాలని ప్రశ్నించారు. అధికార దాహంతో అనధికార పెత్తనం చెలాయించాలని ఆధిపత్య ధోరణితో ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
వైఎస్సార్సీపీకి 11 సీట్లు వచ్చిన ఇంకా బుద్ధి రాలేదని ఆగ్రహించారు. కళ్లు నెత్తికెక్కిన వైఎస్సార్సీపీ నేతల ఆగడాలకు కచ్చితంగా ముక్కుతాడు వేస్తామని స్పష్టం చేశారు. ఎంపీడీవోపై దాడి చేసిన వారు పరారీలో ఉన్నారని వారందరిని వెంటనే పట్టుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ముందు ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని తేల్చిచెప్పారు. కడప రిమ్స్‌లో ఎంపీడీవోని పరామర్శించిన అనంతరం పవన్ కల్యాణ్ అన్నమయ్య జిల్లా గాలివీడుకు బయలుదేరి వెళ్లారు. గాలివీడు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఘటనను ఆయన పరిశీలించారు.
టెస్టులో సెంచరీ కొట్టిన నితీశ్‌పై చంద్రబాబు ప్రశంసల వర్షం - రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహం
అనేకమంది అధికారులపై దాడులు చరిత్ర అతనిది: ఎంపీడీవోపై దాడి చేసిన సుదర్శన్ రెడ్డి గతంలో కూడా అనేకమంది అధికారుల పైన దాడులు చేసిన చరిత్ర ఉందని పవన్ మండిపడ్డారు. గతంలో కూడా అదే గాలివీడు ఎంపీడీవోగా పనిచేస్తున్న ప్రతాప్ పైన సుదర్శన్ రెడ్డి దాడి చేశాడని, శ్రీనివాసరెడ్డి పైన దాడి చేశారని గుర్తు చేశారు. మరో అధికారి నాయక్ పైన కూడా దాడి చేసిన చరిత్ర అతనిది అన్నారు. న్యాయవాదిగా ఉన్న సుదర్శన్ రెడ్డి ఇలాంటి దాడులు చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ వారిని కట్టడి చేయాల్సింది పోయి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించిన అధికారులపై దాడులు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. పోలీసులే కాదు జనం కూడా ఇలాంటి దాడులపై స్పందించాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
రైతు కుటుంబం ఆత్మహత్య ఘటనపై పవన్ స్పందన: అలానే పులివెందుల నియోజకవర్గంలో ఈ రోజు ఓ రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఆ రైతు కుటుంబం ఆత్మహత్య పై విచారణ జరుగుతోందని తెలిపారు. రెండు రోజుల క్రితం రైతు తన భూమి మ్యుటేషన్ పెట్టుకున్నారని అన్నారు. ఈ ఘటన ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని పూర్తి వివరాలు తెలుసుకున్నాక ఏం చేయాలో అది చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.
విద్యుత్ అధికారుల ఫిర్యాదు - వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సహా 16మందిపై కేసు