కడపలోని అల్లూరి సీతారామరాజు నగర్ లో దారుణం చోటుచేసుకుంది. అదనపు కట్నం ఇవ్వలేదని... ఖరీదైన చరవాణిని అత్తింటివారు కానుకగా ఇవ్వలేదని... బంగారు ఉంగరాలు పెట్టలేదని వేధించిన ఓ భర్త.. కట్టుకున్న భార్యను పదిరోజులుగా చిత్రహింసలకు గురిచేశాడు. భార్యను హత్యచేసి శవాన్ని గదిలో నిర్బంధించి ఉడాయించాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సూర్యనారాయణ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి ఆరేళ్ల కిందటే మారుతి అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లి సమయంలో కట్నకానుకల కింద నాలుగు లక్షలు నగదు ఇచ్చారు. పెళైనప్పటి నుంచి మరింత అదనపు కట్నం తేవాలని భార్యను వేధింపులకు గురి చేసేవాడు. భర్తతో పాటు అత్త, మామ, ఆడబిడ్డలు కూడా వేధించేవారు. సిగరెట్ ముక్కలను కాల్చి శరీరంపై వాతలు పెట్టేవాడు. ఇష్టానుసారంగా కొట్టేవాడు.
శుక్రవారం రాత్రి అత్త మామ, ఆడబిడ్డలు ఆమెను దారుణంగా కొట్టగా... అక్కడికక్కడే మృతి చెందింది.
భార్య శవాన్ని గదిలో పెట్టి భర్త పారిపోయాడు. బంధువులు విషయం తెలుసుకుని ఇంటికి వెళ్లగా శవమై కనిపించింది. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. డీఎస్పీ సూర్యనారాయణ మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తతో పాటు అత్త మామ, ఆడబిడ్డల పై హత్య కేసు నమోదు చేసినట్లు డీఎస్పీచెప్పారు.
ఇదీ చదవండి