Shirdi Sai Electricals: వైఎస్సాఆర్ జిల్లాకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ హవా మామూలుగా లేదు. ఒక్క సంవత్సరం వ్యవధిలో ఈ సంస్థకు సుమారు 92 వేల కోట్లు రూపాయల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టారు. జగన్ సర్కారు అస్మదీయులకు ఏ స్థాయిలో దోచిపెడుతోందో చెప్పడానికి ‘షిర్డీసాయి ఎలక్ట్రికల్స్’కి చేకూరుతున్న అనుచిత లబ్ధే నిదర్శనం. టెండర్ల ప్రక్రియ నిర్వహించేది కేవలం కాగితాల్లో రికార్డు చేయడం కోసమే.! షిర్డీసాయికి ఏ టెండర్ వెళ్లాలో ముందే నిర్ణయం జరిగిపోతుంది.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు తయారు చేసే పెద్ద కంపెనీల్లో షిర్డీసాయి ఒకటి కావొచ్చు.! అయితే మాత్రం..రాష్ట్రంలోని అన్ని డిస్కంల పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరా కాంట్రాక్ట్ ఆ సంస్థకే దక్కుతుందా? ఏ సంస్థలూ పోటీకి రావా? పోనీ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో ఆ సంస్థకున్న అనుభవం దృష్ట్యా.. మరే కంపెనీ పోటీ పడలేకపోయిందనే అనుకుందాం. మరి స్మార్ట్‌మీటర్ల తయారీలో ఆ సంస్థకున్న అనుభవం, అర్హతలేంటి? ఒక్క స్మార్ట్‌మీటర్ కూడా తయారు చేయని ఆ సంస్థకు.. 18.58 లక్షల వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌మీటర్లు, విడిభాగాల అమరిక, తొమ్మిదేళ్లపాటు నిర్వహణ కాంట్రాక్ట్ ఎలా దక్కింది? అలాంటి కాంట్రాక్ట్‌లు పట్టేయడంలో ఆరితేరిన అదానీ సంస్థ కూడా షిర్డీ సాయితో పోటీ పడలేక ఎల్2గా మిగిలిపోవడమేంటి? ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తే వాళ్లు అమాయకుల కిందే లెక్క. ఎందుకంటే అది షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కాబట్టి..! ఆ సంస్థ తలుచుకుంటే నిబంధనల్నీ మారిపోతాయి...! ఏ కాంట్రాక్ట్ అయినా... ఆ సంస్థకే దక్కేలా కొత్త నిబంధనలు పుట్టుకొస్తాయి. షరతులు రూపొందుతాయి. టెండర్ నిబంధనల్ని రూపొందించే ప్రక్రియలో అధికారులతో పాటు, షిర్డీసాయి సంస్థ ప్రతినిధులూ పాల్గొంటారన్న ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలకు ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరాలో షిర్డీ సాయి సంస్థ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఏటా ఎన్ని వేల ట్రాన్స్‌ఫార్మర్లు కొనాల్సి వచ్చినా... షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ మినహా, రాష్ట్రంలోని మరే ఇతర సంస్థా టెండర్ ప్రక్రియలో పాలొనేందుకు వీల్లేని విధంగా డిస్కంలు నిబంధనలు రూపొందిస్తున్నాయి. డిస్కంలు వివిధ రకాల ట్రాన్స్‌ఫార్మర్లను వేల సంఖ్యలో కొనుగోలు చేస్తుంటాయి. ప్రతి డిస్కం ఒక్కో దఫాకి సుమారు రూ.500 కోట్ల విలువైన ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలుకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నాయి. దానిలో పాలొనే సంస్థల వార్షిక టర్నోవర్... మొత్తం టెండర్ విలువంత ఉండాలని షరతు పెడుతున్నాయి.
SPDCLఇటీవలే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రూ.140 కోట్లతో 10 వేల ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలుకి ఒకే టెండర్ పిలిచింది. చిన్న చిన్న సంస్థలేవీ టెండర్ ప్రక్రియలో పాల్గొనలేకపోయాయి. పోటీనే లేకపోవడంతో షిర్డీసాయి సంస్థ ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌కి భారీ మొత్తం కోట్ చేసింది. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ లక్షా 39 వేల 999 రూపాయల చొప్పున సరఫరా చేసేలా SPDCL వర్క్‌ఆర్డర్ ఇచ్చింది. CPDCL, EPDCL మరో రూ.200 కోట్ల విలువైన ట్రాన్స్‌ఫార్మర్లు కొనుగోలు చేశాయి.. షిర్డీసాయి నుంచి డిస్కంలు ఏ ప్రమాణాలున్న ట్రాన్స్‌ఫార్మర్లు కొంటున్నాయో... అలాంటి ట్రాన్స్‌ఫార్మర్లనే అన్ని ఖర్చులు కలిపి దక్షిణ హరియాణ బిజిలీ వితరణ్ నిగమ్ లిమిటెడ్ 70 వేల 967రూపాయలు , ఉత్తర హరియాణ బిజిలీ వితరణ్ నిగమ్ లిమిటెడ్ 65వేల10 రూపాయల చొప్పున కొంటున్నాయి. అక్కడితో పోలిస్తే షిర్డ్డీసాయి సంస్థకు ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌పై 69 వేల నుంచి 75 వేల రూపాయల వరకు డిస్కంలు అదనంగా చెల్లిస్తున్నాయి.
ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ఏ డిస్కం పరిధిలోనైనా, ఏ రకం ట్రాన్స్‌ఫార్మర్ల కాంట్రాక్ట్‌నైనా షిర్డీసాయి సంస్థే దక్కించుకోవడంతో... రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలు ఒకటొకటిగా మూతపడుతున్నాయి. 1998లో కడప జిల్లాలో ఏర్పాటైన రాఘవేంద్ర ఇండస్ట్రీస్, ప్రొద్దుటూరులోని లక్ష్మీవెంకటేశ్వర ఇండస్ట్రీస్, అనంతపురం జిల్లాలోని రాయలసీమ పవర్ ప్రొడక్ట్స్ పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. చిన్న ట్రాన్స్‌ఫార్మర్ కంపెనీలన్నీ మూతపడటంతో.. వైండింగ్ వైరు తయారు చేసే యూనిట్లకూ పని లేకపోవడంతో అవి క్రమంగా హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలిపోతున్నాయి. షిర్డీసాయి సంస్థకు సొంతంగా వైండింగ్ వైరు తయారీ యూనిట్ ఉంది.
రాష్ట్రంలో 18.58 లక్షల వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌మీటర్లు, అనుబంధ పరికరాల అమరిక, 93 నెలలపాటు నిర్వహణ కాంట్రాక్ట్‌ని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకే తాజాగా ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ కాంట్రాక్ట్ మొత్తం ఎంతో తెలుసా? 6వేల 888 కోట్ల రూపాయలు. ఒక్కో మీటరుకి ఆ సంస్థకు చెల్లిస్తోంది 37వేల రూపాయలు. షిర్డీసాయికి ఆ కాంట్రాక్ట్ కట్టబెట్టి, కనీ వినీ ఎరుగని ధరలు చెల్లించేందుకు ప్రభుత్వం పెద్ద కథే నడిపింది. కనీసం వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న కంపెనీలకే బిడ్ దాఖలు చేసేందుకు అర్హత కల్పిస్తూ డిస్కంలు నిబంధనలు మార్చేశాయి. షిర్డీసాయి సంస్థకు మీటర్లు, అనుబంధపరికరాలు తయారు చేసే యూనిట్‌లు లేకపోయినా... బిడ్ దాఖలు చేసేందుకు అర్హత లభించింది. కేవలం మీటర్లే తయారు చేస్తున్న ఓ మాదిరి కంపెనీలు డిస్కంలు నిర్దేశించిన వార్షిక టర్నోవర్ నిబంధనతో బిడ్ దాఖలుకు అర్హత కోల్పోయాయి. చివరకు షిర్డీసాయి, అదానీ సంస్థలు మాత్రమే పోటీలో నిలిచాయి. ప్రభుత్వం షిర్డీసాయికే మొత్తం కాంట్రాక్ట్ కట్టబెట్టాలని నిర్ణయించుకుంది కాబట్టి..సహజంగానే ఆ సంస్థ ఎల్1గాను, అదానీ ఎల్2గాను వచ్చాయి.
సౌర విద్యుత్, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల్ని కూడా షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, దాని అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కంపెనీలకే ప్రభుత్వం కట్టబెట్టింది. నెల్లూరు జిల్లా రామాయపట్నం దగ్గర ఇండోసోల్ సంస్థ సౌర విద్యుత్ ప్యానళ్ల తయారీ పార్కు ఏర్పాటుకి 5,147 ఎకరాలు సేకరణకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కడప జిల్లా పైడిపాలెం దగ్గర 33వేల 33 కోట్ల రూపాయల పెట్టుబడితో 7,200 మెగావాట్‌ల సామర్థ్యంగల పంప్డ్ హైడ్రో, సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఇండోసోల్ సంస్థకు కేటాయించింది. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు సోమశిల, ఎర్రవరం దగ్గర 8వేల855 కోట్లతో 12వందలు, 900 మెగావాట్‌ల రెండు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులకు అనుమతిచ్చింది.
కడప నగరాన్ని ఆనుకుని ఐటీ సెజ్‌కు కేటాయించిన భూముల్ని జగన్ ప్రభుత్వం షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కి కారు చౌకగా కట్టబెట్టింది. 52.45 ఎకరాల ఐటీ సెజ్ భూముల్ని డీనోటిఫై చేయించి... దానిలో 49.8 ఎకరాల్ని షిర్డీసాయి సంస్థకు 42వేల 48లక్షల రూపాయలకు కట్టబెట్టింది. ఆ భూముల విలువ ఇప్పుడు 150 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఆ భూముల చుట్టూ నివాస ప్రాంతాలున్నాయి. అర కిలోమీటరు పరిధిలోనే సింగపూర్ టౌన్‌షిప్, కేంద్రీయ విద్యాలయం, రామకృష్ణమఠం, ప్రభుత్వ ఆసుపత్రి, కొత్తగా నిర్మిస్తున్న క్యాన్సర్ ఆస్పత్రి, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి వంటివి ఉన్నాయి. కొత్త కలెక్టరేట్ కూడా దీనికి దగ్గర్లోనే ఉంది. కీలకమైన ప్రదేశంలోని ఈ విలువైన భూముల్ని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ప్రేమతో అతి తక్కువ ధరకు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.