Telugu Elevates in Other States : ఇటీవల తమిళనాడులోని కృష్ణగిరి నుంచి ఎంపీగా ఎన్నికైన గోపీనాథ్ లోక్‌సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీనిపై తెలుగు రాష్ట్రాల నుంచేకాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ‘‘మాది తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. నేను ఎంపీనైనా, అక్కడి రాజకీయాల్లో రాణిస్తున్నా నా మాతృభాష మాత్రం తెలుగే. ఇందులో దాపరికం లేదు. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ విషయాన్ని సగర్వంగా చెప్పడానికి నేనెప్పుడు వెనకాడలేదు. గతంలో తమిళనాడు అసెంబ్లీలోనూ తెలుగులోనే మాట్లాడేవాడినని మాతృభాషపై తనకున్న అభిమానాన్ని, మమకారాన్ని ఆయన ఎలుగెత్తి చాటారు. తెలుగులో మాట్లాడడమే నామోషిగా భావిస్తూ వచ్చిరాని పరాయిభాషల్లోనే సంభాషించే చాలామందికి ఇదో పాఠం. మాతృభాషను గౌరవించాలనే కనువిప్పు!
వృత్తి, వ్యాపారాల కోసం మరికొందరు : వందల ఏళ్ల క్రితం ఉపాధి, ఉద్యోగం, వ్యాపారాల కోసం తెలుగు నేల నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, అండమాన్-నికోబార్ తదితర ప్రాంతాలకు చాలామంది వలసవెళ్లారు. రాష్ట్రాల విభజన సందర్భంలో తెలుగు ప్రాబల్యం ఉన్న కొన్ని ప్రాంతాలు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రల్లో కలిశాయి.
ఇలా ఆంధ్ర, తెలంగాణ వెలుపల పెద్ద సంఖ్యలో నేటికీ తెలుగువారు ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ, వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా నిలపరా నీ జాతి నిండు గౌరవం’’ అని నినదిస్తూ మాతృభాష, సంస్కృతి వికాసానికి కృషి చేస్తున్నారు.
కథలన్నీ ‘కంచి’కే చేరాలి : భాషావేత్తలు, తెలుగు సంఘాల లెక్కల ప్రకారం తమిళనాడులో తెలుగు మూలాలున్నవారు సుమారు 2 కోట్ల మంది ఉన్నారని అంచనా. ఒకప్పుడు తమిళనాడు ప్రాంతం తెలుగువారైన నాయక రాజుల ఏలుబడిలో ఉండడంతో మెరుగైన జీవనం, కొలువుల కోసం చాలామంది తమిళనాడు వెళ్లి స్థిరపడ్డారు. కంచి, మదురై వంటి పట్టణాలు తెలుగుకు పట్టుకొమ్మల్లా నిలిచాయి. తంజావూరును మరాఠాలు పాలించినా స్థానికంగా తమిళ ప్రాబల్యం ఉన్నా ఒకప్పుడు తెలుగు ఆస్థాన భాషగా వెలుగొందింది.
ప్రస్తుతం ‘నిర్బంధ తమిళం’ వల్ల తెలుగు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే తెలుగు మాధ్యమాన్ని రద్దు చేశారు. పాఠశాలు మూతపడ్డాయి. వాటి ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయి. అయినా తెలుగువారు కళల్ని, సాహిత్యాన్ని పరిరక్షించుకోవడానికి కృషి చేస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం అందిస్తున్న పుస్తకాలతో మాతృభాష నేర్చుకుంటున్నారు. విశేషమేమిటంటే 500 ఏళ్ల క్రితం నాటి పదాలు కొన్ని అక్కడ నేటికీ వాడుకలో ఉన్నాయి.
పశ్చిమబెంగాల్‌లో ‘అధికార భాష’: పశ్చిమ బెంగాల్‌లో స్థిరపడ్డ తెలుగువారి సుదీర్ఘ పోరాట ఫలితంగా అక్కడి ప్రభుత్వం తెలుగును అధికారిక భాషగా గుర్తించింది. కోల్‌కతా, 24 పరగణాలు, మిడ్నాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఖరగ్‌పుర్ ఓటర్లలో 35 శాతం తెలుగువారే. టీటాఘర్ తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు తెలుగు పాఠశాలలు నడుస్తున్నాయి. ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో కోల్‌కతాలోని కాళీఘాట్ వద్ద తెలుగు పాఠశాల నడుస్తోంది. స్థానికంగా ఉన్న తెలుగు సంఘాలు భాష, సంస్కృతి కోసం కృషి చేస్తున్నాయి. తెలుగు పండుగలకు సమ్మేళనాలు, సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నాయి.
మహారాష్ట్రలో ‘తెలుగు సాహిత్య అకాడమీ’ : మహారాష్ట్రలో సుమారు కోటిమంది తెలుగువారు నివసిస్తున్నారు. తెలంగాణ సరిహద్దు జిల్లాలలో పాటు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగువారి ప్రాబల్యం ఉంది. వారి పోరాట ఫలితంగా రెండేళ్ల క్రితం ప్రభుత్వం ‘మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడమీ’ని ఏర్పాటు చేసి నిధులు కేటాయించింది. దీని ద్వారా తెలుగు భాషాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర’ అనే సంస్థ ద్వారా తెలుగు పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ‘తెలుగుబడి’ పేరుతో భాషపై శిక్షణ ఇస్తున్నారు.
అండమాన్‌లో రెండో అతిపెద్ద భాష : అండమాన్-నికోబార్‌లో సుమారు 2.3 లక్షల మంది తెలుగువారున్నారు. రాజకీయంగా కూడా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. రాజధాని శ్రీవిజయపుర (పోర్ట్‌బ్లెయిర్), హడ్డో సహా పలు ప్రాంతాల్లో ఉన్నత స్థాయి వరకు తెలుగులో బోధిస్తున్నారు. ఆంధ్రా అసోసియేషన్ క్రియాశీలకంగా పనిచేస్తోంది. తెలుగు పండుగల్ని సామూహికంగా నిర్వహిస్తున్నారు.
కర్ణాటక, ఒడిశాల్లోనూ కృషి: కర్ణాటకలో సుమారు 35 లక్షల మంది తెలుగువారు నివసిస్తున్నారు. ఇళ్లలో తెలుగులోనే మాట్లాడుతారు. ఒడిశాలో 20 లక్షలమంది తెలుగువారు ఉన్నారు. వీరంతా తమ భాషా వికాసానికి కృషి చేస్తున్నారు. ఇళ్లలో తెలుగులోనే మాట్లాడుతున్నారు. అదే మాధ్యమంలో చదువుకుంటున్నారు.
తెలుగు భాషోత్సవం- గిడుగు స్ఫూర్తిని అందుకోలేకపోతున్న యువతరం - telugu language day celebrations