KRMB Office in Vijayawada: జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయ్పురితో గురువారం భేటీ అయ్యారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు నిర్వహణకు ఏపీ తరపున నిధుల కేటాయింపుపై చర్చించారు. కృష్ణా బోర్డును విజయవాడ తరలించే అంశంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగింది. విజయవాడలో కేఆర్ఎంబీ కార్యాలయం కోసం భవనం కేటాయించాలని రాయ్ పురి కోరారు.
త్వరలోనే కేటాయిస్తాం: బోర్డు కార్యకలాపాలకు అనువుగా ఉండే కార్యాలయాన్ని త్వరలోనే కేటాయిస్తామని సాయిప్రసాద్ తెలిపారు. కార్యాలయానికి అవసరమైన వసతి ఏర్పాటు చేస్తామని సాయిప్రసాద్ పేర్కొన్నారు. అదే విధంగా బోర్డుకు సంబంధించిన పలు అంశాలు ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయి.
తెలంగాణ ప్రతిపాదించిన మూడో దశ టెలీమీటరీ వ్యవస్థ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం తెలిపింది. ఇప్పటికే రెండు దశల్లో టెలీమీటర్ల ఏర్పాటుకు అంగీకరించామని, నిధులు సైతం తామే భరిస్తున్నామని చెప్పారు. మూడో దశలో తెలంగాణ ప్రతిపాదించిన టెలీమీటర్లు తమ అంతర్గత అవుట్‌లెట్‌ల వద్దవి అని, ఇది ఏ మాత్రం తగదని తెలియజేశారు.
కుడి వైపున మాత్రమే సీఆర్‌పీఎఫ్ భద్రతా ఏర్పాట్లు: కేవలం నాగార్జునసాగర్ కుడి వైపున మాత్రమే సీఆర్‌పీఎఫ్ భద్రతా ఏర్పాట్లు చేయడం సరికాదని చెప్పారు. రెండు ప్రభుత్వాలు కూడా సీఆర్‌పీఎఫ్ భద్రత అవసరం లేదని తెలియజేసినందున, భద్రతను తొలగించాలని కోరారు. అయితే తాము కేంద్ర జల్‌శక్తితో సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోగలమని కేఆర్ఎంబీ పేర్కొంటోంది. సీఆర్‌పీఎఫ్ కాకుండా సీఐఎస్ఎఫ్ భద్రతా దళాలు ఏర్పాటు అంశం కూడా ఇరువుని మధ్య చర్చకు వచ్చింది. తాము పూర్తిస్థాయిలో చర్చించిన తరువాతే దీనిపై అధికారికంగా బోర్డుకు లేఖ రాస్తామని సాయిప్రసాద్ తెలిపారు.
బోర్డులో ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యుటేషన్‌పై వెళ్లే అధికారులు 3 సంవత్సరాలు పని చేసేందుకు, అవసరమైతే మరో రెండు సంవత్సరాలు పొడిగించేలా అవకాశం ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా బోర్డుకు ఎవరిని పంపినా, వారి పదవీకాలం మరో మూడు సంవత్సరాలు కచ్చితంగా ఉండేలా చూడాలని రాయ్‌పురి తిరిగి కోరారు. ఎస్‌ఈల విషయంలో ఆ నిబంధన అనుసరించలేమని ఆంధ్రప్రదేశ్ అధికారులు చెప్పారు. కేఆర్ఎంబీకి ఎస్‌ఈ స్థాయి అధికారిని డిప్యుటేషన్‌పై పంపేందుకు అంగీకరించారు. ఈ సమావేశంలో సాయిప్రసాద్, రాయ్పురితో పాటు ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.