Chandrababu on Pending Files : వివిధ శాఖల కార్యదర్శులతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన ఇవ్వాలని అందుకనుగుణంగా శాఖలు వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదులు ఏ విభాగానికి ఎక్కువ వస్తే ఆ శాఖ సరిగ్గా పనిచేయనట్టే భావించాల్సి వస్తుందన్నారు. ప్రజల ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేలా కార్యాచరణ ఉండాలని చంద్రబాబు సూచించారు.
"ఫిర్యాదులు పెరుగుతున్న విభాగం సరిగా పనిచేయనట్లే భావించాలి. ఎక్కువ శాతం ఫిర్యాదులు రెవెన్యూ విభాగంలో వచ్చాయి. రెవెన్యూ నుంచి ఫిర్యాదులన్నీ హోంశాఖకు మారుతున్నాయి. ప్రజలకు ఆమోదయోగ్య పాలన అందించేలా శాఖలు ఉండాలి. ప్రజలకు ఏది అవసరమో వెంటనే గ్రహించగలగాలి. పబ్లిక్ పర్‌సెప్షన్ అంశం ద్వారా చెడ్డపేరు దేనికి వస్తుందో చెబుతాం. రూ.50 కోట్లు దాటిన ప్రాజెక్టులను మానిటరింగ్ గ్రూప్ పర్యవేక్షించాలి." - చంద్రబాబు, ముఖ్యమంత్రి
ఆన్‌లైన్ ఫైళ్లు ఉన్నా కొందరు కార్యదర్శులు పరిష్కారానికి మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది సమయం తీసుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. అంత సమయం తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. దస్త్రాల పరిష్కారంలో, పాలనలో వేేగం పెంచాలని సూచించారు. అంతా తమకే తెలుసనే అహం వద్దని చెప్పారు. అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ విధానాల్ని సమర్థంగా అమలుచేయాలన్నారు. అందుకే ఇలాంటి సమావేశాలు అవసరమని పేర్కొన్నారు. జీవితాంతం నేర్చుకోవాలనే తపన ఉండాలని వివరించారు. పనితీరు నివేదికలు కొందరిని ఎత్తి చూపడానికి కాదని వ్యవస్థను, సమర్థతను మెరుగుపరచడానికే అని చంద్రబాబు తెలిపారు.
Chandrababu on P4 policy : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆర్థికేతర హామీలు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. నిధులు లేవని పనులు ఆపవద్దని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి అధికారులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఉగాది రోజున పీ-4 విధానాన్ని ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. జగన్ పాలనా విధ్వంసంతో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం రూ.22,507 కోట్ల రూపాయల పాత బకాయిలను చెల్లించిందని వివరించారు. క్రమశిక్షణతో బకాయిలు తీర్చేలా ఆర్థికశాఖ పని చేయడాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఇన్ని ఇబ్బందుల్లోనూ ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని చంద్రబాబు చెప్పారు.