YSRCP Irregularties In TUDA: ఐదేళ్ల పాలనలో అన్నిచోట్ల అందినకాడికి దోచుకున్న వైఎస్సార్సీపీ పాలకులు తుడానూ తోడేశారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన విలువైన భూములను లే అవుట్లు వేసి విక్రయించి వందల కోట్ల సొమ్ములను పక్కదారి పట్టించారు. వేలం పాటలతో పాటు లాటరీ పద్ధతిలో స్థలాలు కేటాయించిన తుడా ఆయా ప్రాంతాల్లో కనీస వసతులు మాత్రం కల్పించలేదు. భూములు విక్రయించడం ద్వారా వచ్చిన నిధులను జేబులు నింపుకునే కార్యక్రమాలతో ఖర్చు చేయడంతో తుడా ఆర్థిక చిక్కుల్లో కూరుకుపోయింది.
తుడాను దోచుకున్న వైఎస్సార్సీపీ నాయకులు: గతంలో ఏటా కోట్ల రూపాయల వార్షికాదాయంతో వెలుగులీనిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ గత వైఎస్సార్సీపీ పాలకుల నిర్వాకంతో ఆస్తులన్నీ కరిగిపోయి వెలవెలబోతుంది. తుడా భూముల్ని తెగనమ్మి సొమ్ము చేసుకోవాలన్న గత పాలకుల అవినీతితో ఖజానా మొత్తం ఖాళీ అయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే తుడా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి సంస్థ భూములను అమ్మడమే లక్ష్యంగా పాలన సాగించారు. తొలుత లే అవుట్లలో ఖాళీ స్థలాల్ని విక్రయించి జేబులు నింపుకోవడం ప్రారంభించిన చెవిరెడ్డి ప్రభుత్వ మద్దతు, అనుకూలురైన అధికారుల అండతో తన మార్కు పాలనకు తెరతీశారు.
తుడాకు అదనపు ఆస్తులు సమకూర్చడం సంగతి ఎలా ఉన్నా ఉన్న భూముల్ని విక్రయించడం ప్రారంభించారు. వందల కోట్ల రూపాయలు పోగేసి స్వప్రయోజనాలే లక్ష్యంగా వ్యయం చేశారు. అవసరం ఉన్నా లేకున్నా సిమెంట్ బెంచీల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులకు వైఎస్‌ఆర్ మార్గ్ పేరుతో రాతి పలకలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు.తుడా పరిధిలో రేణిగుంట మండలం సూరప్పకశం వద్ద 146 ఎకరాలు, నగరి మండలం కీలపట్టు వద్ద పది ఎకరాలు, చంద్రగిరి మండలం మామండూరు వద్ద 12 ఎకరాలు లేఅవుట్ గా మార్చి దశలవారీగా విక్రయించి దాదాపు మూడు వందల కోట్ల రూపాయలను ఆర్జించారు. వేలం పాటలతో పాటు లాటరీ పద్ధతిలో స్థలాలు దక్కించుకున్న ప్రజలకు లే అవుట్లలో కనీస వసతులను కల్పించలేదు. వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చిన భూముల్లో కనీస వసతుల కల్పించకపోవడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి: మామండూరు భూమిని 22 ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించకుండానే సాధారణ ఎన్నికలకు ముందు హడావుడిగా లే అవుట్‌గా వేసి విక్రయించారు. దాదాపు సంవత్సరం గడుస్తున్నా నేటికీ తుడా స్థలాల కొనుగోలు దారులకు రిజిస్ట్రేషన్ చేయించలేని పరిస్థితి నెలకొంది. భూములు విక్రయించగా సమకూరిన నిధులను స్వప్రయోజనాలకు ఖర్చు చేసి జేబులు నింపుకోవడంపై అంతటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో లే ఔట్లకు అనుమతులు, భవన నిర్మాణ రుసుములు, తుడా భవనాలకు అద్దెలు వంటి వాటితో అభివృద్ధి పనులను చేపట్టారు. గత వైఎస్సార్సీపీ పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడంతో ఆస్తులన్నీ కరిగిపోగా ఉద్యోగుల జీత భత్యాలకు సైతం దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది.
''గతంలో తుడా ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చీకటి పాలన చేశారు. ఆ తుడాలో వచ్చే ఆదాయమంతటినీ తన సొంత నియోజకవర్గానికి మళ్లించి నిధులను దుర్వినియోగం చేశారు. తుడా పరిధిలో ఉన్న చంద్రగిరి మామండూరులో వెంచర్ వేసి కోట్ల రూపాయలను కొల్లగొట్టారు''-మహేష్, తిరుపతి
తుడా నిబంధనల అతిక్రమణతో రైతుల ఇబ్బందులు