Leprosy Hospital Problems In Vizianagaram District: విజయనగరం జిల్లా పొగిరిలోని లెప్రసీ ఆసుపత్రి అర్ధ శతాబ్ధానికిపైగా కుష్ఠు రోగులకు వైద్య సేవలు అందించింది. అనాథలైన రోగులను అక్కున చేర్చుకుని ఆసరాగా నిలిచింది. కానీ నేడు దాని పరిస్థితి దయనీయంగా మారింది. 8 గదులు పూర్తిగా పాడైపోయాయి. మరో మూడు గదులు ఎప్పుడు కూలిపోతాయే తెలియని పరిస్థితిలో ఉన్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం కూడా లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శిథిలావస్థలో కుష్టు ఆసుపత్రి: విజయనగరం జిల్లా రాజాం మండలం పొగిరిలోని కుష్ఠు వ్యాధి నిర్మూలనా కేంద్రాన్ని 1962లో ప్రారంభించారు. డెన్మార్క్ దేశ సహకారంతో స్థాపించిన ఈ 11 గదుల ప్రభుత్వ ఆసుపత్రి కుష్ఠు రోగులకు ఎంతో మెరుగైన సేవలందించింది. వ్యాధికి గురైన వారికి చికిత్సతో పాటు శాశ్వత రోగులకు వసతితో కూడిన వైద్యమందించింది. 60 ఏళ్లకి పైగా ఇలా వేలాది మందికి బాసటగా నిలిచిన ఈ కేంద్రం పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. ఆసుపత్రిలోని 8 గదులు శిథిలావస్థకు చేరాయి. మిగిలినవి సైతం పాడైపోయాయి. పైకప్పు పెచ్చులూడిపోయి ఎప్పుడు మీద పడతాయోనని రోగులు బిక్కుబిక్కుమంటు బతుకుతున్నారు. వర్షాలు పడితే నీరంతా గదుల్లో పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కుష్ఠు వ్యాధి నిర్మూలన కేంద్రంలో ప్రస్తుతం 20 పడకలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 20 మంది రోగులు వసతితో కూడిన శాశ్వత చికిత్స పొందుతున్నారు. వీరే కాకుండా చికిత్స కోసం నిత్యం పదుల సంఖ్యలో ఈ కేంద్రానికి వస్తుంటారు. ప్రస్తుతం రోగులకు జీఆర్ఎం ఫౌండేషన్ సహకారంతో వంట మనిషి, సరకులను సమకూర్చి భోజనాలు పెడుతున్నారు. మిగిలిన సౌకర్యాలు మాత్రం సరిగా లేవు. తాగునీటి ట్యాంకు సైతం శిథిలావస్థకు చేరడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. మరగుదొడ్లు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆసుపత్రిలో రోగులకు వైద్య సౌకర్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. వైద్యుడితో పాటు పది మందికి గానూ ఆరుగురు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. వైద్యాధికారి, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఎఫ్ఎన్వో మాత్రమే సేవలందిస్తున్నారు. ఫిజియోథెరపిస్ట్, రెండు స్వీపరు పోస్టులు, M.N.O. పోస్టు ఖాళీగా ఉన్నాయి. భవనాలు శిథిలావస్థకు చేరిన విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వైద్యుడు కృష్ణమోహన్ తెలిపారు.
"కుష్ఠు వ్యాధి నిర్మూలిద్దం - కుష్ఠు రహిత సమాజాన్ని నిర్మిద్దాం" అనే నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నాయి. రోగుల గుర్తింపుకు ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. అయితే వ్యాధి నిర్మూలనకు అండగా నిలుస్తున్న కుష్ఠు వ్యాధి నియంత్రణ కేంద్రాలను గాలికొదిలేయడం మాత్రం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కేంద్రంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
''భవనాలు శిథిలావస్థకు చేరిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరాను. దీనిపై ప్రభుత్వం సకాలంలో స్పందించాలని ఆశిస్తున్నాను''-కృష్ణమోహన్ వైద్యాధికారి
'కరోనా మహమ్మారికి కుష్ఠు టీకా పనిచేస్తోంది'