కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో.. రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెదేపా, జనసేన, సీపీఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, శ్రీశైలం ప్రాజెక్టును బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయాలని పలువురు నేతలు కోరారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై.. తెలంగాణ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. అనుమతులు లేని ప్రాజెక్టులు నిర్మిస్తూ శ్రీశైలం జలాశయంలో.. కనీస నీటిమట్టం 854 అడుగులు అమలు చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
రాయలసీమ ప్రాంత వాసులు.. కరువు, వలసలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారని ఆవేదన చెందారు. గాలేరు - నగరి అంతర్భాగమైన వామి కొండ, సర్వరాయ సాగర్ లను పూర్తిస్థాయి నీటిమట్టంతో నింపేందుకు త్వరితగతిన పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీటి కింద ఉన్న కాలువల నిర్మాణం చేపట్టి.. ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నారు. గాలేరు - నగరి రెండవ దశ లోని 4, 5, 6, 7 ప్యాకేజీ పనులు సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: