స్థానిక సంస్థల ఎన్నికలంటేనే ఎంతో ఉత్కంఠ.. పైగా ఎవరి గెలుపోటములైనా కొద్ది ఓట్ల తేడాలోనే ఉంటాయి. పైగా ఓట్లు కూడా తక్కువ అయినందున ఒకటి.. రెండు.. కూడా కీలకమే. అందుకే పంచాయతీ ఎన్నికల్లో ఓటున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా గ్రామాల్లో రాజకీయ పక్షాలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో 33,00,625 మంది ఓటర్లు ఉండగా.. యువత 6,89,727 మంది ఉన్నారు. వీరిలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వారు 34,289 మంది, 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు వారు 6,55,438 మంది ఉన్నారు. సాధారణంగా గతంలో ఓటు నమోదుపై గ్రామీణ యువతకు అంతగా అవగాహన లేక స్థానిక రాజకీయ నాయకుల వద్దకు వెళ్లేవారు, వారికి ఇష్టముంటే ఓట్లు నమోదు చేయించేవారు. లేకపోతే లేదు. అది కాలక్రమేణా మారుతూ వచ్చింది. ఎన్నికల సంఘమే పలుసార్లు ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తోంది. పైగా ఓటు నమోదుకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. దీనికి తోడు అంతర్జాలంలో ఎప్పుడైనా ఓటు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అందుకే యువత ఓటు నమోదుకు ఆసక్తి చూపుతున్నారు.
వారిని ఆకట్టుకునేందుకు పాట్లు
పంచాయతీ సర్పంచితో పాటు వార్డు సభ్యుని తలరాతను మార్చేందుకు ఒక్క ఓటు చాలు. ప్రస్తుత ఎన్నికల్లో యువత ఓటును దక్కించుకునేందుకు అభ్యర్థులు, ఆశావహులు యత్నాలు సాగిస్తున్నారు. ఎలాగైనా వారిని తమ దరికి చేర్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. పల్లెల్లో వివిధ సంఘాలు, గ్రూపులకు నాయకత్వం వహించే యువకులతో పాటు జనాలతో కలివిడిగా ఉండే వారికి వల వేసేందుకు యత్నాలు ప్రారంభించారు. ఇందుకు యువతకు అవసరమయ్యే క్రీడా పరికరాలతో పాటు ఇతర సదుపాయాల కల్పన దిశగా చర్యలు చేపడుతున్నారు. వారిని ఆకట్టుకునే దిశగా ఎవరికి వారు పావులు కదుపుతున్నారు. పలు గ్రామాల్లో ఈ సారి పోటీ చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. సమిశ్రగూడెంలో వాలంటీరుగా పని చేస్తున్న ఒకరికి సర్పంచిగా పోటీ చేసే అవకాశం దక్కింది. యువత కూడా ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ చదవండి: