సార్వత్రిక సమరంతో మొన్నటి వరకు ఆసక్తిని రేపిన నవ్యాంధ్ర...మరో పోరుకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 13వేల60 గ్రామ పంచాయతీలకు త్వరలోనే ఎన్నిక చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సార్వత్రికం ముగిసిన తర్వాత స్థానిక ఎన్నికలు చేపట్టాలనుకున్న ఎన్నికల సంఘం...దానికి తగ్గట్టే అడుగులేస్తోంది. ఆయా పంచాయతీలకు ఇప్పటికే ఓటర్ల జాబితాలు ప్రకటించింది.
పావులు కదపుతున్న ప్రధాన పార్టీలు..
పశ్చిమగోదావరి జిల్లాలో 48 మండలాల పరిధిలో 909 పంచాయతీలు ఉన్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. 15 అసెంబ్లీ స్థానాల్లో 13 చోట్ల విజయం సాధించిన వైకాపా... ఆ స్థాయిలోనే గ్రామ పంచాయతీలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాలు రూపొందిస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చినా...స్థానిక పోరులో బలం నిరూపించుకుంటామని జిల్లా తెదేపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేనలోనూ అదే వైఖరి కనిపిస్తోంది.