Government not Take Care on Polavaram Residents: రాష్ట్రానికి వెలుగులు పంచే పోలవరం ప్రాజెక్ట్ కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల బతుకుల్లో చీకట్లు కమ్ముకున్నాయి. పోలవరం నిర్వాసితుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిర్వాసిత కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోగా.. ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. జగన్ ప్రభుత్వం ఉపాధి, ప్యాకేజీ ఉసే ఎత్తడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు.
పోలవరం నిర్వాసితుల ఇళ్లు పూర్తయ్యాయనే విధంగా ఉన్నాయి. ఇక చేరిపోవడమే అన్నట్లు ముఖ్యమంత్రి జగన్ ఉపన్యాసలకు పోతారు. కానీ 13 ఏళ్లుగా ఆ కాలనీల నిర్మాణం కొనసాగుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసి వస్తే నిర్వాసితులకు ప్రభుత్వం నరకం చూపిస్తోంది. ఉన్న ఊరిని, సొంత ఇంటినీ వదిలుకుని బతుకుజీవుడా అంటూ ఊరి కాని ఊరికి అసలు ఒక రూపం దిద్దుకోని పునరావాస కాలనీలకు వచ్చి నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం మాటలు నమ్మి రోడ్డున: ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి అరకొరగా పూర్తయిన ఇళ్లల్లోనే తలదాచుకుంటున్నారు. కానీ నిర్వాసితులకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ఉపాధి చూపలేదు. సీఎం జగన్ చెప్పినట్లుగా ఉపాధి, శిక్షణ అవకాశాలు మెరుగుపరచలేదు. తమ ఊరిలో వ్యవసాయ పనులు, ఏదో ఒక పనిచేసుకుని బతికేవాళ్లమని.. ప్రభుత్వం మాటలు నమ్మి పునరావాస కాలనీలకు వస్తే ఎలాంటి ఉపాధి చూపడం లేదని బాధితులు వాపోతున్నారు.
గత ఎన్నికల సమయంలో పోలవరం నిర్వాసితులకు ఉచిత హామీలిచ్చి గద్దెనెక్కిన జగన్.. ఆ తర్వాత ఒక్క హామీ నెరవేర్చలేదని బాధితులు వాపోతున్నారు. ఉపాధి కల్పించలేదని, ప్యాకేజీలు పూర్తిగా ఇవ్వలేదని తెలిపారు. నిర్వాసిత కాలనీల్లో ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు.
అస్తవ్యస్థంగా నిర్వాసిత కాలనీలు : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని తాడ్వాయిలో ఆరువేల కుటుంబాలకు పైగా నిర్వాసితుల కోసం ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇందులో కొన్ని పూర్తి కాగా కొందరు ఆ ఇళ్లల్లోకి వచ్చేశారు. కుకునూరు మండలం తెల్లరాయిగూడెం, పోలవరం, దేవీపట్నం మండలంలోని ఇందుకూరు సమీప కాలనీ, ఎటపాక మండలంలోని పోలవరం నిర్వాసితులకు నిర్మించిన కాలనీల్లో అస్తవ్యస్థ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కనీస సౌకర్యాలు లేవు: తాడ్వాయి సమీపంలో 6,048 ఇళ్ల నిర్మాణం కోసం ఇంటి స్థలాలు సేకరిస్తే 3,905 ఇళ్ల నిర్మాణంలో కొన్ని పూర్తయ్యాయి. కిందటి ఏడాది వరదలు ముంచెత్తడంతో కొందరు ఈ కాలనీల్లోని ఇళ్లల్లోకి నివాసానికి వచ్చేశారు. ఇప్పటికీ కాలనీలోని మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. ప్రధాన రహదారికి దూరంగా ఉన్న ఈ కాలనీ నుంచి బయటకు వెళ్లేందుకు ఎలాంటి రవాణా, బస్సు సౌకర్యాలూ లేవు. కనీసం ఆటోలు అందుబాటులో ఉండవు. మంచినీటి సరఫరా ఏర్పాట్లు పూర్తి కాలేదు. వీధి లైట్లు వెలగడం లేదు. పాఠశాల లేదు, ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలు లేనేలేవు.
నిర్వాసితుల సొంత ఖర్చులతో నిర్మాణాలు : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆ ప్రాజెక్టు ప్రాంతంలోని గ్రామాలను 2010లో ఖాళీ చేయించారు. అందులో భాగంగా పైడిపాక నిర్వాసితుల కోసం పోలవరం మండల కేంద్రం సమీపంలో పునరావాస కాలనీ నిర్మించారు. పేరుకే ఇళ్లు నిర్మించారు తప్ప.. ఇప్పటి వరకు ప్లాస్టరింగ్, ప్లోరింగ్ పనులు చేయలేదు. మరుగుదొడ్డి ఇతర సౌకర్యాలను నిర్వాసితురాలే సొంత సొమ్ములతో ఏర్పాటు చేసుకున్నారు.
వరద ముంపులో పునరావాస కాలనీలు : ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లిలో నిర్వాసితుల ఇళ్లు వర్షానికి ఉరుస్తున్నాయి. ఇళ్ల చుట్టూ వర్షపు నీరు నిలిచిపోతోంది. గోదావరి వరద నీరు చుట్టుముట్టేస్తుందని పునరావాస కాలనీ నిర్మిస్తే.. అక్కడ కూడా గోదావరి నీరు ముంచేస్తుంటే వారు ఎక్కడికి వెళ్లాలి. 2022 గోదావరి వరదల నేపథ్యంలో కుక్కునూరు మండలంలోని తెల్లరాయిగూడెం పునరావాస కాలనీ వరద ముంపులో చిక్కుకుంది. ఇక్కడ దాదాపు 400కు పైగా ఇళ్లు నిర్మించారు. పునరావాసం కల్పించాల్సిన కాలనీయే ముంపులో చిక్కుకోవడం విచిత్రం. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో నిర్మించిన పునరావాస కాలనీని సైతం వరద నీరు ముంచెత్తింది.