ఇది ఉద్యానవనమో, లేదా అడవిలో కట్టుకున్న అతిథి గృహమో అనుకుంటున్నారా..! కాదు. ఇదో ఇల్లు..! విజయనగరం జిల్లా జొన్నవలసకు చెందిన పూసపాటి దేవవర్మ తన ఇంటినే నందనవనంలా మార్చుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన దేవవర్మ డిగ్రీ పూర్తయ్యాక వ్యవసాయ రంగంలోకే అడుగుపెట్టారు. చిన్నప్పటి నుంచే ప్రకృతి ప్రేమికుడిగా ఉన్న ఆయన తన ఇంటిని దశల వారీగా ఓ పొదరిల్లుగా మార్చారు.
ఉద్యానవనాన్ని తలపించేలా...
ఇంటికి ప్రధాన ద్వారం గుండా ప్రవేశిస్తే ఇరువైపులా రకరకాల పూలమొక్కలు, వృక్షాలు దర్శనమిస్తాయి. ఇంటికి రెండో వైపు ద్వారం నుంచి లోపలకి వెళ్తే ఇరువైపులా హోయలొలికే రకరకాల పూల మొక్కలు ఆహ్వానం పలుకుతాయి. అలానే ఎడమవైపునకు నడిస్తే ఉద్యానవనాల్లో తీర్చిదిద్దినట్లుగా ప్రత్యేక లాన్ ఉంటుంది. లాన్ మధ్యలో ముచ్చట గొలిపే కృష్ణుడి బొమ్మ. మరికొంచెం ముందుకెళ్తే చిన్నపాటి నీటికొలను ఉంటుంది. ఆ కొలనులో తామరలతలు, కొలను పక్కన అందమైన ఆడబొమ్మ ఆకట్టుకుంటాయి.
కనువిందు చేసే అలంకరణలు...
ఆ లాన్ నుంచి బయటకొస్తే చుట్టూ ప్రత్యేక టైల్స్‌తో కాలిబాట. బాట పక్కనే కనువిందు చేసే పూలమొక్కల డిజైన్లు. మరి కొంచెం ముందుకొస్తే పార్క్ తరహాలో ఏర్పాటు చేసిన బల్లలు, వాటి పక్కనే పూలకుండీలు. ఎక్కడికక్కడ ప్రత్యేక నిర్మాణాలు, వాటికి తగ్గట్టు అలంకరణలు కనువిందు చేస్తాయి. ప్రాచీనత దెబ్బతినకుండా హంగులకు ఆధునికతను జోడించి ఇంటిని తీర్చిదిద్దుకున్నారు. ఇంటి వెనుక భాగం ఓపెన్ ఆడిటోరియంను తలపిస్తుంది. కుటుంబ పూర్వీకులను స్మరించుకునేందుకు ప్రత్యేక గదిని నిర్మించారు. ఇలా ఇంద్రవనాన్ని తలపించేలా రెండున్నర ఎకరాల్లో ఇంటిని నిర్మించుకున్నారు.
పలు రకాల పక్షుల పెంపకం...
ఈ నందనవనానికి అదనపు సోయగాలు, హంగులు తెచ్చేలా పక్షుల గూళ్లను నిర్మించారు. రకరకాల పక్షులు, వాటి స్వేచ్ఛకు తగినట్లు ఏర్పాట్లు చేశారు. గ్రామీణ వాతావరణానికి తగ్గట్టు 15 రకాల కోళ్లను కూడా పెంచుతున్నారు. వాటి కోసం ప్రత్యేకంగా గూళ్లు కట్టారు. ప్రకృతిపై ప్రేమ, విద్యాభ్యాస సమయంలో పాఠశాలలో నేర్చుకున్న అంశాలను అమలు చేశానని దేవవర్మ చెబుతున్నారు. ఎంత డబ్బు వెచ్చించినా దొరకని ప్రశాంతత, మానసిక ఆనందం.. తనకు ఇంటి వద్దే లభిస్తున్నాయని దేవవర్మ చెబుతున్నారు.
ఇదీచదవండి.