విశాఖ జిల్లా దేవరాపల్లి, అనంతగిరి మండలాలకు సరిహద్దులో ఉన్న సరియా జలపాతం వద్ద విషాదం నెలకొంది. పరవాడలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న కొందరు యువకులు బుధవారం సరియా జలపాతం అందాలను చూసేందుకు వచ్చారు. వారిలో మురళీకృష్ణ అనే యువకుడు జలపాతంలో స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు జారిపోయాడు. అనంతరం మురళీకృష్ణ కోసం గాలించిన తోటి యువకులు.. చివరికి అతని మృతదేహాన్ని వెలికితీశారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలానికి చెందిన మురళీకృష్ణ కుటుంబం నాలుగేళ్ల క్రితం విశాఖ జిల్లా పరవాడ వచ్చి స్థిరపడినట్లు అతని స్నేహితులు తెలిపారు. అనంతగిరి పోలీసులు కేసు నమోదుచేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
ఇదీ చదవండి: విశాఖలో కోటిన్నర విలువ చేసే గంజాయి పట్టివేత