R5 Zone Houses: కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ.. అమరావతి ఆర్-5 జోన్‌లో ఆగమేఘాల మీద ఇళ్ల నిర్మాణానికి సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి జగన్.. విశాఖ, కర్నూలులో పేదల ఇళ్లపై మాత్రం దృష్టి పెట్టడంలేదు. అమరావతిలో పేదలపై ఉన్న ప్రేమ.. విశాఖ, కర్నూరులో పేదలపై ఎందుకులేదని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
రాజధాని అమరావతిలో రాజధానేతరులకు స్థలాలిచ్చి, ఇళ్లు కడుతున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్.. కార్యనిర్వాహక రాజధానిగా చెబుతున్న విశాఖ, న్యాయరాజధానిగా చెబుతున్న కర్నూలులో.. పేదల ఇళ్ల నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవడంలేదు. ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ’అని చెబుతున్న సీఎంకు.. విశాఖ, కర్నూలులో పేదలు కనిపించడం లేదా అనే ప్రశ్నలు.. వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: Dhulipalla on R5 Zone Houses: 'మాటల్లో ప్రేమ.. చేతల్లో విషం.. ఇదే జగన్ నైజం'
విశాఖపట్నం పరిధిలోని లక్షా 4 వేల 68 మంది పేదలకు 2022 ఏప్రిల్‌లో.. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నిర్మాణాలు ప్రారంభించి.. 15 నెలలు కావస్తోంది. ఇప్పటికీ 64.7% నిర్మాణాలు పునాది దశ దాటలేదు. 16,534 ఇళ్ల నిర్మాణాలు.. బేస్‌మెంట్ స్థాయిలోనే ఉన్నాయి. పూర్తైంది 112 గృహాలు మాత్రమే. కొనసాగుతున్న.. నిర్మాణాలూ నాసిరకంగానే ఉన్నాయి. అమరావతిలో ఆర్-5 జోన్‌కు సంబంధించి.. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నా.. ఆ కేసులు పరిష్కారమయ్యే వరకు నిధులివ్వబోమని.. కేంద్రం స్పష్టం చేసినా.. అవసరమైతే సొంతంగానే నిధులు ఖర్చు చేస్తామని ప్రకటిస్తున్నారు. అదే ప్రేమ విశాఖ పేదలపై ఎందుకు లేదు?
ఇళ్లు లేని పేదలు.. కర్నూలులో 25 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. 2019 డిసెంబరులో.. వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కర్నూలుకు సుమారు 15 కి. మీ దూరంలోని పి.రుద్రవరం గ్రామం సమీపంలో భూముల్ని రైతుల నుంచి సేకరించి.. లేఅవుట్లు వేశారు. సరిహద్దులు ఏర్పాటు చేసినా, లబ్ధిదారులకు మాత్రం స్థలాలు చూపించలేదు. మూడున్నరేళ్లు దాటినా.. ఇప్పటికీ అదే పరిస్థితి. 2010లో కర్నూలు నగరానికి సమీపంలోని పందిపాడు వద్ద 2,500 మందికి కేటాయించిన ప్లాట్లనే జగనన్న కాలనీగా మార్చారు. అక్కడి పేదలను ఇళ్లు నిర్మించుకోమని కోరగా.. 354 మంది ముందుకు వచ్చారు. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం సరిపోక.. చాలామంది ముందుకు రాలేదు. అక్కడ కూడా ఇప్పటికీ.. ఒక్క ఇల్లూ పూర్తి కాలేదు. వెరసి అధికారం చేపట్టాక జగన్ న్యాయ రాజధానిగా చెబుతున్న కర్నూలులో కట్టిన ఇళ్లు శూన్యం’.
ఇదీ చదవండి: R-5 Zone Houses Construction: లబ్ధిదారుల రుణంతో ఇళ్ల నిర్మాణం..కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎలా?
అమరావతిలో కట్టినట్టే కర్నూలు పేదలకు కూడా ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను సంతోషంగా స్వీకరించవచ్చు కదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అక్కడి పేదలు ఏం పాపం చేశారని.. వారిని పట్టించుకోలేదు. ఈ ప్రశ్నలకు.. ప్రభుత్వం జవాబులు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: Amaravathi R5 Zone: అమరావతి సెంటు భూమి పట్టా.. అనర్హుల చిట్టా