విశాఖ మన్యం అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి ప్రకృతి రమణీయత. ఊటీలోని అందాలను... కొడైకెనాల్లోని సోయగాలను మేళవం చేసినట్టుండే ఆహ్లాదం అరకు సొంతం. అటువంటి కమనీయత మాటున 'నిగూఢ సాగు' జరుగుతోంది. కొండకోనల్లో నివసించే అమాయకపు ఆదివాసీల జీవన విధానం రోజురోజుకూ కలుషితమవుతోంది. పచ్చని చెట్ల చాటున గంజాయి ఏపుగా పెరుగుతోంది.
మన్యం టూ మహానగరం...
విశాఖ మన్యంలో పండించిన గంజాయి దేశ నలుమూలలకూ చేరుతోంది. మహారాష్ట్ర నుంచి మొదలుకొని నాగపూర్, హైదరాబాద్, విజయవాడ, చెన్నై తదితర నగరాలకు రవాణా జరుగుతోంది. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న గంజాయి సాగు... మాఫియా రంగ ప్రవేశంతో మహావృక్షంలా తయారైంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన ముఠాల రాకతో సాగు వేల ఎకరాలకు చేరింది.
12 వేల ఎకరాల్లో...
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 15 వేల ఎకరాల్లో గంజాయి సాగవుతోంది. ఒక్క విశాఖలోనే 12 వేల ఎకరాల్లో ఈ పంట పండుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో 2250 ఎకరాలు, మిగతా జిల్లాల్లో 750 ఎకరాల్లో ఈ సాగు జరుగుతోందని ఎక్సైజ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మన్యంలో ప్రతిఏటా 3 లక్షల టన్నుల గంజాయి దిగుబడి వస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని 11 మండలాల్లో 159 గ్రామాల్లో ప్రధానంగా గంజాయి సాగవుతోంది.
రూ.5400 కోట్ల వ్యాపారం...
మన్యంలో కనీవినీ ఎరగని రీతిలో గంజాయి వ్వాపారం జరుగుతోంది. ఒక్కో గంజాయి మొక్క ద్వారా 250 నుంచి 300 గ్రాముల సగటు దిగుబడి వస్తుంది. ఎకరా విస్తీర్ణానికి సగటున వేయి కిలోల గంజాయి సాగవుతోంది. ప్రస్తుతం కిలో గంజాయి ధర రూ.2000 ఉంది. ఎకరా సాగుచేస్తే రూ.20 లక్షల ఆదాయం వస్తోంది. ఈ లెక్కల ప్రకారం విశాఖ మన్యంలో ప్రతిఏటా 5400 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్టు తెలుస్తోంది.
గిరిజనుల అమాయకత్వంతో...
మన్యంలో సాగవుతున్న గంజాయిని గిరిజనుల అమాయకత్వంతో గమ్యానికి చేరుస్తున్నారు. వారి సహాయంతో కాలినడకన, గుర్రాల ద్వారా మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారు. మన్యంలో 22 ప్రాంతాల్లో వందలాది స్టాక్‌పాయింట్లు ఉన్నాయి. అక్కడి నుంచి 26 రవాణా మార్గాల ద్వారా జాతీయ రహదారులు, ప్రధాన మార్గాలకు చేర వేస్తున్నారు. ఆ తర్వాత సరకును సరిహద్దులు దాటిస్తూ కోట్లు గడిస్తున్నారు.
మన్యంలో "మత్తు సామ్రాజ్యం" ఇలానే రాజ్యమేలితే... "ఆంధ్రా భవిష్యత్తే ప్రశ్నార్థకం"గా మారే ప్రమాదముంది.
ఇదీ చదవండీ: సాగర తీరాన... పౌర్ణమి వేళ 'వెన్నెల్లో నడక'