కొవిడ్-19 మూడో దశకు ఆసుపత్రులను సిద్ధం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవిడ్ ఆసుపత్రుల్లో శతశాతం ఆక్సిజన్ పడకలుగా మార్చాలని ఆదేశించారు. ఈ మేరకు నోటిఫై చేసిన ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయాలన్నారు. రెండో దశ సమయంలో రోజుకు అత్యధికంగా 104 టన్నుల ఆక్సిజన్‌ను జిల్లాలో వినియోగించామని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలతో చర్చించాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరును ఆదేశించారు. ఆక్సిజన్ సిలిండర్ల నిల్వ పాయింట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయు)లు ఏర్పాటు చేయాలని, 0-5, 5-10ఏళ్ల పిల్లలకు వైద్య సేవలందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
సీఎస్‌ఆర్ బ్లాక్‌లో పిల్లల కోసం పడకలను సిద్ధం చేయాలని, ప్రైవేటు ఆసుపత్రులతో చర్చించి కార్యాచరణ రూపొందించుకోవాలని జేసీ అరుణ్‌బాబును కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్. సూర్యనారాయణ, డ్రగ్స్ అధికారిణి రజిత, డీఐసీ జీఎం రామలింగరాజు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ప్రకాశరావు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనుల వేగం పెంచాలి..
విశాఖ జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, వివిధ నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఉపాధి హామీ పనులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ జలకళ పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్.. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 3 లక్షల 91 వేల మందికి పని కల్పిస్తున్నట్లు చెప్పారు.
జూన్ నెలాఖరుకు కోటి 25 లక్షల పని దినాలను సాధించే దిశగా పనులను వేగవంతం చేయాలన్నారు. వైయస్సార్ జలకళ పథకంలో రైతులకు 200 వ్యక్తిగత సాగు బోరుబావులను తవ్వించాలని ఆదేశించారు. ఈనెల 16 నుండి నిర్వహించే భవన నిర్మాణ పక్షోత్సవాలు సందర్భంగా అవగాహన కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు.
ఇదీ చదవండి:
Polavaram: మారిన నదీ సహజ ప్రవాహ మార్గం.. రివర్స్ స్లూయిస్ గేట్ల ద్వారా డెల్టాకు నీళ్లు!