ఒంటరి మహిళలే లక్ష్యంగా విశాఖలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను, వారికి సహకరిస్తున్న తల్లిని ప్రత్యేక దర్యాప్తు బృందం పట్టుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి కుమారులు చంద్ర శేఖర్ రెడ్డి, గోపినాథ్ రెడ్డి చెడు వ్యసనాలకు బానిసలై మహిళల మెడల్లో నగలు చోరీనే వృత్తిగా మరల్చుకున్నారు. జనసంచారం లేని ప్రాంతాల్లో ఒంటరి, వృద్ధ మహిళలే లక్ష్యంగా చేసుకుని నగలు దొంగిలించేవారు. మూడేళ్ల నుంచి వరుసగా 51 దొంగతనాల్లో 1382.90 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. దొంగిలించిన బైకులపైనే పారిపోతుండేవారు. వారికి బుద్ధి చెప్పాలిసిన తల్లి కూడా ఈ దొంగతనాలను ప్రోత్సహించింది.
భారీగా బంగారం స్వాధీనం
దొంగతనాలను అరికట్టడానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం... నాలుగు నెలలు కష్టపడి ఇద్దరు నిందితులనూ, వారికి సహకరించిన తల్లిని అదుపులోకి తీసుకుంది. నిందితుల నుంచి రూ. 34.49 లక్షలు విలువైన 1142.50 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు వినియోగించిన ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా చెప్పారు.