Chandrababu Comments on Fake Votes: చంద్రగిరి టీడీపీ ఇన్‌ఛార్జి పులివర్తి నానిని చంద్రబాబు (Chandrababu) పరామర్శించారు. ఇటీవల దొంగ ఓట్లు తొలగించాలంటూ పులివర్తి నాని (Pulivarthi Nani) నిరసన వ్యక్తం చేస్తూ అస్వస్థతకు గురయ్యారు. స్విమ్స్‌లో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న పులివర్తి నానిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో వేలసంఖ్యలో దొంగ ఓట్లు చేర్చారని, పీలేరు, శ్రీకాళహస్తి, సత్యవేడులో సైతం దొంగ ఓట్లు చేర్చారని విమర్శించారు. దొంగ ఓట్ల వ్యవహారంపై తిరుపతి కలెక్టర్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిందని చంద్రబాబు చంద్రబాబు తెలిపారు. దొంగ ఓట్లు నమోదు చేస్తుంటే అధికారులేం చేస్తున్నారని ప్రశ్నించారు.
కొన్ని చోట్ల ఏకంగా పోలింగ్ బూత్‌లు మార్చేశారని మండిపడ్డారు. ఒకే పేరు కలిగిన వ్యక్తికి మూడు బూత్‌ల్లో ఓటు ఉందని ఆరోపించారు. సచివాలయ సిబ్బంది సాయంతో దొంగ ఓట్లు నమోదు చేశారన్న చంద్రబాబు, ఈ స్థాయిలో అక్రమాలు చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదని అసహనం వ్యక్తం చేశారు. అదే విధంగా ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోవద్దని వాలంటీర్లను కోరుతున్నామని, కొన్ని చోట్ల బోగస్ ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులు కూడా ఇస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
రాబోయే సునామీలో వైఎస్సార్సీపీ చిరునామా గల్లంతు: చంద్రబాబు
ఇలాంటి ఫిర్యాదులు దేశంలో ఎక్కడా రాలేదని ఎన్నికల సంఘం చెప్పిందని చంద్రబాబు పేర్కొన్నారు. చట్ట ప్రకారం పనిచేయాలని అధికారులను కోరుతున్నామన్నారు. అక్రమాలు చేసిన వారిని వదిలిపెట్టమన్న చంద్రబాబు, జైలుకు పంపుతామని హెచ్చరించారు. తాను కుప్పంలో ప్రచారం చేయకపోయినా ఎక్కువ మెజారిటీతో గెలిచానని, తప్పుడు విధానాలతో గెలవాలని అనుకుంటే కుదరదని అన్నారు.
చంద్రగిరిలో దొంగ ఓట్లపై 6 నెలలుగా పులివర్తి నాని పోరాటం చేస్తున్నారని, ఫాం-6, 7, 8 విచ్చలవిడిగా వాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. చంద్రగిరిలో దాదాపు 14 వేల దొంగ ఓట్లు చేర్చారని ఆరోపించారు. అంగన్వాడీలు, ఉద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్న చంద్రబాబు, తాము అధికారంలోకి వచ్చాక అందరి సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే టీడీపీ పోరాటం చేస్తోందన్న చంద్రబాబు, గత 40 ఏళ్లుగా తాను ఈ జిల్లాను చూస్తూ వస్తున్నానని అన్నారు. ఏన్నడూ లేనంతగా మనీ పవర్, దోచుకోవడం, భూకబ్జాలు లాంటివి ఇప్పుడు చూస్తున్నానని తెలిపారు. అలా దోచుకున్న డబ్బును తీసుకొచ్చి యథేచ్ఛగా ఎన్నికలలో పంపిణీ చేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకపై ఇలాంటివి జరగనివ్వమని, ప్రజలు వైసీపీని ఇంటికి పంపడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినీ వదిలిపెట్టమని, చట్టప్రకారం విధుల నిర్వర్తించాలని అధికారులను హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారం చేస్తానంటే మాత్రం ఊరుకోమన్నారు.
'ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల బదిలీ - టీడీపీ విజయానికిదే నిదర్శనం'