Patapatnam Govt Model Degree College Hostel issue: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో వసతి గృహం లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రూ.కోట్ల విలువ చేసే వసతి గృహాన్ని నిర్మించి.. రెండేళ్లు గడుస్తున్నా, నేటికీ ఆ వసతి గృహం ప్రారంభానికి నోచుకోక.. విద్యార్థినులు నానా అవస్థలు పడుతున్నారు. కళాశాలకు ప్రతిరోజు అష్టకష్టాలు పడి.. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నారు. వసతి గృహాన్ని ప్రారంభించాలని అధికారులను ఎన్నిసార్లు వేడుకున్నా.. పట్టించుకోవటం లేదంటూ గిరిజన విద్యార్థినులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రగతి సాధించాలన్న లక్ష్యంతో రూ.12 కోట్లతో 2017వ సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో స్థాపించింది. దీంతో పాతపట్నంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాల నుంచి విద్యార్థులు.. వందల కిలోమీటర్లు ప్రయాణించి కళాశాలకు విచ్చేసి.. ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.
ఈ క్రమంలో కళాశాల భవనంతో పాటు ప్రభుత్వం బాలబాలికలకు వసతి గృహాలను కూడా నిర్మించింది. కానీ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడంతో బాలికల వసతి గృహాన్ని ఇప్పటికీ ప్రారంభించలేదు. దీంతో పాతపట్నం పరిసర ప్రాంతాల నుంచి 100 మందికి పైగా విద్యార్థినులు కళాశాల చుట్టు పక్కల ప్రైవేటు వసతి గృహాల్లో అధిక ధరలను చెల్లిస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేను భామిని గ్రామం నుంచి వచ్చి ఈ కళాశాలలో డిగ్రీ చదువుకుంటున్నాను. మా ఊరి నుంచి కళాశాలకు రావడానికి రెండు గంటల సమయం పడుతుంది. చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ఊరి నుంచి సమయానికి బయలుదేరినా ఇక్కడికి వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. ఒక్కొక్కసారి రెండు క్లాసులు కూడా అయిపోతున్నాయి. దీంతో నేను, నా ఫ్రెండ్స్ కలిసి రూమ్ అద్దెకు తీసుకున్నాము. దయచేసి అధికారులు స్పందించి వసతి గృహాన్ని ప్రారంభించాలని వేడుకుంటున్నాను.-పూజ, డిగ్రీ 2వ సంవత్సరం విద్యార్థిని
అంతేకాదు, ప్రైవేటు వసతి గృహాలు కూడా కళాశాలకు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో విద్యార్ధినులు ప్రతిరోజు నడవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరూ పేద, మధ్యతరగతి, గిరిజన కుటుంబాలకు చెందినవారే. వసతి గృహం లేని కారణంగా ప్రతి నెల వేల రూపాయలు ఖర్చులను.. తమ తల్లిదండ్రులు భరించలేకపోతున్నారని వాపోతున్నారు. అధికారులు త్వరగా స్పందించి.. వసతి గృహాన్ని త్వరితగతిన ప్రారంభించాలని వేడుకుంటున్నారు.
ఈ సమస్యపై డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సూర్య చంద్రరావు మాట్లాడుతూ.. కళాశాల ఊరికి దూరంగా కొండ ప్రాంతంలో ఉన్న కారణంగా రక్షణ గోడ నిర్మించే ప్రతిపాదనలు అధికారులకు పంపామన్నారు. త్వరలోనే రక్షణ గోడను కూడా నిర్మించి.. బాలికల వసతి గృహాన్ని ప్రారంభిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
ఇవీ చదవండి