వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఏవైనా సమస్యలు ఉన్నాయా... తదితర వివరాలు తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిటిజన్ షిప్ ఔట్ రీచ్ సర్వే నిర్వహిస్తోంది. ఇప్పటివరకూ అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే ఈ సర్వే నిర్వహించగా.. ఇప్పుడు గ్రామాల్లోనూ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇది జరుగుతోంది. సచివాలయ సిబ్బంది మొత్తం ప్రతినెలా నాలుగో శుక్ర, శనివారాల్లో ఈ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
సచివాలయ సిబ్బంది ఒకరు ఒక వాలంటీరు పరిధిలోని 50 ఇళ్లను సర్వే చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేయాలి. తర్వాత లబ్ధిదారుని ఫొటో కూడా తీసుకుంటారు. ఈ సర్వేని సిబ్బంది పక్కదారి పట్టించకుండా సక్రమంగా నిర్వహించేలా ఒక ఫీచర్ని కూడా జోడించారు. సర్వే చేసిన తర్వాత లబ్ధిదారుని ఫొటో తీసుకోవాలి. లబ్ధిదారుడు కెమెరావైపు చూస్తూ కనురెప్పలు ఆడిస్తేనే ఫొటో కాప్చర్ అవుతుంది.
కొన్ని ప్రశ్నల ఆధారంగా ఈ సర్వే జరుగుతోంది. మీ గ్రామ లేదా వార్డు సచివాలయం ఎక్కడుందో మీకు తెలుసా? మీ గ్రామ లేదా వార్డు వాలంటీరు మీకు తెలుసా? మీ వాలంటీర్ ఎన్ని రోజులకి ఒక్కసారి మీ ఇంటిని సందర్శిస్తున్నారు? సచివాలయం అందిస్తున్న సేవలు, సర్వీసులు తెలుసా? మీ సచివాలయం ద్వారా అందుతున్న సేవలకు సంబంధించి మీకు ఏమైనా సమస్య ఉందా? మీకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసా? అని లబ్ధిదారులను ప్రశ్నిస్తారు.
ఈక్రమంలో ప్రభుత్వ పథకాల పేర్లను లబ్ధిదారులకు తెలియజేస్తారు. ఈ సర్వే ప్రతినెలా నిర్వహించాలని ప్రభుత్వం చెబుతుండడంతో నెలలో ఆ రెండు రోజులూ సిబ్బంది మొత్తం ఆ పనిలోనే నిమగ్నమవ్వాలి. మిగతా సాధారణ సర్వీసులకు ఆ రెండు రోజులు కొంత ఇబ్బందులు తప్పవని సిబ్బంది చెబుతున్నారు.
ఇదీ చదవండి: