Public facing Bridge Problems: శ్రీ సత్యసాయి జిల్లాలోని రాయలవారిపల్లి నుంచి ప్రవహిస్తున్న చిత్రావతి నదిని దాటేందుకు ఆర్డీటీ సాయంతో గ్రామస్థులు కొంత నగదును జమ చేసుకుని 2011లో వంతెన నిర్మించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2020లో జిల్లాలో కురిసిన వర్షాలకు ఆ వంతెన తెగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి కూలిపోయి రెండు సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవటంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తి నుంచి రాయలవారిపల్లికి వెళ్లే ప్రధాన మార్గం గ్రామంలో నివసిస్తున్న 165 మంది కుటుంబాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
పక్కనే ఉన్న ఎనుములపల్లికి చెందిన రైతుల పొలాలు రాయలవారి పల్లిలో ఉండటంతో నదిని దాటి అవతలివైపునకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నది దాటలేక చేతికొచ్చిన పంటను వదిలేస్తున్నారు. నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు సైతం వీల్లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదివరకు నిర్మించిన తాత్కాలిక వంతెనలు సైతం వరద ధాటికి కొట్టుకుపోయాయని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త వంతెన నిర్మించాలని వేడుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వంతెన కూలిపోవటంతో ఇబ్బందులు పడుతున్నాం. నది దాటి అవతలి వైపునకు వెళ్లాలంటే కష్టమవుతోంది. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుని సమస్యను పరిష్కరించాలి. -గ్రామస్థులు
వరదల ధాటికి తెగిపోయిన వంతెనలను అధికారులు స్పందించి త్వరగా పూర్తి చేసి తమ పంటలు నష్టపోకుండా చూడాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: