అరుదైన వైద్యం చేశారు.. ప్రాణం పోశారు - prakasham district latestnews
అత్యంత క్లిష్టతరమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు.. ప్రకాశం జిల్లా ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రి వైద్యులు. అరుదుగా ఈ ఆపరేషన్ చేసి ఓ ఇంజనీరింగ్ యువకుడికి ప్రాణదాతలయ్యారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు సంఘమిత్ర ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి.. ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి ప్రాణదానం చేశారు. గుండె చుట్టూ రక్తం గడ్డ కట్టి నీరుగా మారగా.. చాకచక్యంగా శస్త్రచికిత్స అందించి విజయం సాధించారు. ప్రపంచంలోనే ఇలాంటి చికిత్స చాలా అరుదుగా చేశారని వైద్యులు పేర్కొంటున్నారు.
ఇటీవల క్విస్ కళాశాల వైపు నుంచి ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇందులో శ్రీ హరి అనే యువకుడికి గుండెకు తీవ్ర గాయాలయ్యాయి. స్పృహ తప్పిపోయిన ఈ యువకుడిని హుటాహుటిన సమీపంలో ఉన్న సంఘ మిత్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి గమనించిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గుండె భాగం చిట్లి రక్తశ్రావం అయ్యింది.. గుండె చుట్టూ రక్తం గడ్డకట్టిందన్నారు. ఐసీయూలో ఉన్న శ్రీహరికి తక్షణం శస్త్ర చికిత్స అందించాలని వైద్యులు భావించారు.
ఆపరేషన్ థియేటర్‌కు కూడా తీసుకువెళ్ళడానికి సమయం చాలకపోవడంతో అన్ని పరికరాలు, సామగ్రిని ఐసీయూలోకి తీసుకువచ్చి అక్కడే శస్త్ర చికిత్స అందించారు. గుండెచుట్టూ పేరుకుపోయిన రెండు లీటర్ల రక్తాన్ని జాగ్రత్తగా బయటకు తీశారు. రక్త శ్రావం అయిన భాగాన్ని గుర్తించి.. చేతితో అదిమి పట్టుకొని శస్త్రచికిత్స చేశారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా యువకుడి ప్రాణాలు దక్కేవి కావు.. వైద్యులంతా ఈ శస్త్ర చికిత్సలో పాల్గొని యువకుడి ప్రాణాన్ని కాపాడారు. ఇలాంటి శస్త్ర చికిత్స చాలా అరుదైందని, విజయవంతం కావడం ఆనందంగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.