AP Free Bus Scheme : ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పుడున్న వాటికి అదనంగా 2000ల బస్సులతో పాటు, 11 వేల 500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. ఎంత రాబడి తగ్గుతుంది, ఏయే బస్సులకు డిమాండ్ ఏర్పడుతుందనే వివరాలతో ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదికను సర్కార్‌కి అందజేశారు.
ఈ పథకంపై అధ్యయనం చేసేందుకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి నేతృత్వంలో తాజాగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం ఇతర రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు తీరును చూడటంతో పాటు, అధికారులిచ్చిన నివేదికపైనా పరిశీలన చేయనుంది. ప్రస్తుతం ఆర్టీసీలో నిత్యం సగటున 44 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో పాస్‌హోల్డర్లు కాకుండా రోజుకు 27 లక్షల మంది టికెట్లను కొనుగోలు చేస్తారు. వీరిలో సూపర్‌లగ్జరీ, అల్ట్రాడీలక్స్, ఏసీ సర్వీసుల్లో ప్రయాణించేవారు దాదాపు 3 లక్షల మంది దాకా ఉన్నారు.
మిగిలిన 24 లక్షల మంది పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసు, విశాఖపట్నం, విజయవాడలోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసు ప్రయాణికులు. ఈ సర్వీసుల్లోనే రోజుకు ప్రయాణికుల సంఖ్య 10 లక్షల వరకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించేవారిలో 40 శాతం మహిళలు, 60 శాతం పురుషులు ఉంటున్నారు. స్త్రీలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య 60 శాతానికి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు.
కొత్త బస్సులు, సిబ్బంది కావాల్సిందే : ప్రస్తుతం బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 68-69 శాతం ఉండగా, అది 95 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. తెలంగాణలో స్త్రీలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తే అక్కడి ఓఆర్ 95 శాతానికి చేరింది. ప్రయాణికుల సంఖ్య పెరిగే సర్వీసుల్లో బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంటుంది. మొత్తం ఐదు రకాల సర్వీసులు కలిపి అదనంగా 2000ల బస్సులు కావాలని అధికారులు తేల్చారు. ఆర్టీసీలో ఇప్పటికే డ్రైవర్ల కొరత ఉంది. ఇబ్బందులు లేకుండా కొత్త పథకం అమలు జరగాలంటే 5000ల మంది డ్రైవర్లు, మరో 5000ల మంది కండక్టర్లు, 1500 మంది మెకానిక్‌లు ఇతర సిబ్బంది కలిపి మొత్తం 11,500 మంది ఉద్యోగులు అవసరమని అంచనా వేశారు.
నెలకు రూ.200 కోట్లు : ప్రస్తుతం ఆర్టీసీకి టికెట్ల ద్వారా రోజు వారీ రాబడి రూ.16 నుంచి రూ.17 కోట్లు ఉంటోంది. ఇందులో మహిళా ప్రయాణికుల ద్వారా రూ.6 నుంచి రూ.7 కోట్లు వస్తోంది. వారికి ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఆ రాబడిని వదులుకోవాల్సిందే. అంటే నెలకు సగటున రూ.200 కోట్లు ఆర్టీసీ కోల్పోతుంది. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ నెలకు రూ.300 కోట్ల వరకు జీతాలు చెల్లిస్తోంది.
మహిళలకు శుభవార్త - ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం కీలక అడుగు
"రైట్, రైట్" మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు కసరత్తు-అమలు ఎప్పట్నుంచంటే? - free bus for women