What to do on Chollangi Amavasya : పుష్య మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని 'చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య' అని పిలుస్తారు. ఈ నెలలో 29వ తేదీన చొల్లంగి అమావాస్య వచ్చింది. ఈ చొల్లంగి అమావాస్యకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. అయితే, మౌని అమావాస్య రోజున కొన్ని విధి విధానాలను పాటిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ వివరిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం
సాధారణంగా ప్రతి అమావాస్య పితృ దేవతలకు ప్రియమైన తిథి. కానీ, ఈ చొల్లంగి అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ రోజు ఎవరైనా సరే ఇంటి యజమాని దగ్గర్లో ఉన్న నదిలో స్నానం చేసి, అనంతరం పెద్దలను స్మరించుకుంటూ దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు నీళ్లలో కలిపి చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో నుంచి దర్పనం ఇవ్వాలి. ఇలా చేస్తే 21 తరాల పాటు పితృ దేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారట. అలాగే 21 తరాల పాటు మీ వంశం వర్ధిల్లుతుందని మాచిరాజు తెలిపారు.
- చొల్లంగి అమావాస్య రోజున దుర్గాదేవిని దర్శించుకుంటే మంచిది. ఆ రోజు అమ్మవారి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తే మంచిది.
- అలాగే ఆ రోజు ఆంజనేయ స్వామిని దర్శిస్తే మంచిది. స్వామి వారికి తమలపాకుల దండ సమర్పించవచ్చు. ఇలా చేస్తే రాజయోగం పడుతుంది.
'అసాధ్య సాధక స్వామిన్
అసాధ్యం తవకిన్ వధ
రామదూత కృపా సింథో
మత్కార్యం సాధయ ప్రభో'
ఈ శ్లోకాన్ని మనస్సులో అనుకుంటే, అసాధ్యమని అనుకున్న పనులు సులభంగా జరుగుతాయి.
- అన్నం దానం, వస్త్ర దానం చేస్తే మంచిది.
- దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర సమర్పించవచ్చు.
- బార్లీ గింజలు పాలతో కడిగి ఆ తర్వాత నీళ్లతో కడిగి పారే నీళ్లలో వదిలిపెడితే చాలా మంచిది.
- శివుడిని గంధం రాసిన మారేడు దళాలతో పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
రాజ స్నానం :
ప్రయాగ్రాజ్లో దాదాపు 45 రోజుల పాటు జరిగే మహా కుంభ మేళాలో మొత్తం ఆరు రాజ స్నానాలు జరగనుండగా, అతి ముఖ్యమైన మూడవ రాజ స్నానం మౌని అమావాస్య రోజు జరుగుతుంది. మౌని అమావాస్య రోజు చేసే రాజ స్నానం మహా కుంభ మేళాలో అతిపెద్ద స్నానంగా పరిగణిస్తారు. ఈ స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు రాజ స్నానం చేసే శుభ సమయం బ్రహ్మ ముహూర్తం సాయంత్రం 5.25 నుంచి ప్రారంభమవుతుంది. ఈ విశేష సమయం సాయంత్రం 6:18 గంటల వరకు ఉంటుంది. నిజానికి ఏడాదికి 12 అమావాస్యలు ఉంటాయి. పుష్య బహుళ అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. అందులోనూ మహా కుంభ మేళా, మౌని అమావాస్యల కలయిక అత్యంత విశిష్టమైనదని జ్యోతిష్య శాస్త్ర పండితులు, ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మహాకుంభమేళాలో వేల సంఖ్యలో నాగసాధువులు - వాళ్లు ఏం తింటారో తెలుసా?
తిరుమల 'పాండవ తీర్థం'- ఒక్కసారి స్నానం చేస్తే చాలు- అన్నింటా విజయం తథ్యం!