Ukraine On North Korean Troops : రష్యా తరఫున యుద్ధంలో పోరాడుతున్న ఉత్తర కొరియా సైనికులు భారీగా చనిపోవడమో, తీవ్రంగా గాయపడడమో జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. తమ సైనికులతో జరగుతున్న పోరులో ఇప్పటికే 3000లకు పైగా సైనికులు ప్రాణాలు కోల్పోవడమే లేదా తీవ్రంగా గాయపడడమో జరిగిందన్నారు. కర్స్క్ ప్రాంతంలో జరుగుతున్న పోరాటానికి సంబంధించి ఆర్మీ కమాండర్ నుంచి తనకు ఈ మేరకు నివేదిక అందిందని జెలెన్‌స్కీ తెలిపారు. ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలు, ఆయుధ సామగ్రిని పంపే అవకాశం ఉందన్నారు.
రష్యా, ఉత్తర కొరియాల మధ్య అధునిక యుద్ధరీతులు, అడ్వాన్స్‌డ్ మిలటరీ సాంకేతికత బదిలీ పెరుగుతున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఉత్తర కొరియా మరిన్ని బలగాలను తమతో పోరాడేందుకు పంపించనుందని, అందకు తాము సిద్ధంగా ఉన్నట్లు జెలెన్‌స్కీ తెలిపారు. మాస్కో, ప్యాంగ్‌యాంగ్ మధ్య బంధం కారణంగా కొరియా చుట్టున్న దేశాల్లో, జలాల్లో అస్థిరత, ప్రమాదం పెరిగేందుకు అవకాశం ఉందని అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాలని చెప్పారు. మరోవైపు తమకున్న సమాచారం ప్రకారం 1100 మంది కిమ్ సైన్యం చనిపోయి ఉండడమో లేదా గాయపడడమో జరిగిందని దక్షిణ కొరియా వెల్లడించింది.
పుతిన్‌తో కిమ్‌కు ఉన్న మైత్రి నేపథ్యంలో రష్యా సైన్యాన్ని బలోపేతం చేసేందుకు పాంగ్‌యాంగ్ తమ సైనికులను బరిలోకి తీసుకొచ్చింది. రష్యాలో శిక్షణ అనంతరం గత కొన్నినెలల నుంచి ఉత్తర కొరియా సైనికులు కుర్స్క్ రీజియన్‌లో ఉక్రెయిన్ దళాలతో పోరాడుతున్నారు. ఆగస్టు నుంచి దాదాపు 12000 మంది ఉత్తర కొరియా సైనికులు ఈ ప్రాంతంలో మోహరించినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.