‘బేస్‌మెంట్ నిర్మించకపోతే స్థలం రద్దవుతుంది’ అన్న అధికారుల హెచ్చరికలకు ఆవేదన చెందిన ఓ ఇల్లాలు.. ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి డబ్బుల కోసం యాచనకు ఉపక్రమించింది. ఈ దుస్థితి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సుబ్బరత్తాలు అనే మహిళకు తలెత్తింది. యర్రగొండపాలేనికి చెందిన నేరేళ్ల సుబ్బరత్తాలు భర్త అయిదేళ్ల క్రితం చనిపోయారు. పెద్ద కుమారుడు బ్రహ్మం (15) అమాయకంగా ఉండటం, రెండో కొడుకు శివచంద్రశేఖర్(10) చిన్నవాడు కావడంతో వారిని పోషించేందుకు ఆమె స్థానిక హోటల్లో పని చేస్తోంది. వీరికి జగనన్న కాలనీలో ఇంటిస్థలం మంజూరైంది. అయితే రెండురోజుల క్రితం అధికారులు వచ్చి వెంటనే బేస్‌మెంట్ వేయకపోతే స్థలం రద్దు చేస్తామని చెప్పారు. దీంతో ఆమె దిక్కుతోచని స్థితిలో ఆందోళనకు గురైంది.
ఏ విధంగా డబ్బు ఏర్పాటు చేయాలో అర్ధం గాక యర్రగొండపాలెం ప్రధాన కూడలిలో రెండు రోజులుగా దుకాణాలు, ప్రజల వద్దకు తిరుగుతూ సాయం చేయాలని కోరుతోంది. ఆమె దీనస్థితిని తెలుసుకొని దాతలు తోచిన ఆర్థికసాయం చేస్తున్నారు. ఇది కేవలం తన ఒక్కరి దుస్థితే కాదని, తనలా అనేకమంది డబ్బులు లేక స్థలాలు వదులుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీ చూడండి.
AMARAVATI: ఎమ్మెల్యే శ్రీదేవికి నిరసన సెగ.. రాజీనామా చేయాలని రైతుల డిమాండ్