YSRCP Leaders Encroaching Swarnala Cheruvu in Nellore : ప్రభుత్వ స్థలాలు.. కుంటలు.. చెరువులు.. పార్కు స్థలాలు.. ఇలాదేన్నీ వదలడం లేదు కొందరు అక్రమార్కులు. ఆక్రమణలకు కాదేదీ అనర్హం అంటూ కబ్జాలకు పాల్పడుతున్నారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఈ తంతు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జాగా కనిపిస్తే వేసెయ్ పాగా అన్న చందంగా మారింది నెల్లూరులో పరిస్థితి.
Occupying Swarnala Cheruvu and Building Houses : నెల్లూరు నగర విస్తరణతో వందలాది ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పట్టణ ప్రణాళికకు విరుద్ధంగా కట్టడాలు చేపడుతున్నారు. భూముల విలువ పెరగడంతో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు పవిత్రంగా భావించే బారాషహీద్ దర్గ వద్ద ఉన్న స్వర్ణాల చెరువును ఆక్రమించి ఇళ్లు నిర్మాణాలు చేపడుతుండడంతో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెన్నా తీరంలో వైసీపీ నేతల దందా.. అక్రమంగా పంటలు సాగు.. ఆపై కోట్లలో లీజుకు
Nellore YCP Leaders Occupying Swarnala Cheruvu : నెల్లూరు నడిబొడ్డున కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న బారాషహీద్ దర్గా వద్ద ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రొట్టెల పండుగ నిర్వహిస్తారు. పండుగకు వచ్చే పవిత్ర స్నానాలు కోసం, రొట్టెలు మార్చుకునేందుకు లక్షలాది మంది భక్తులు స్వర్ణాల చెరువుకు తరలివస్తారు. ఎంతో పవిత్రంగా భావించే స్వర్ణాల చెరువు నేడు అక్రమార్కుల చెరలో కుంచించుకుపోతుంది.
నోరు మెదపని అధికారులు.. పోటీపడుతున్న వైసీపీ నాయకులు : ఇరుకళల పరమేశ్వరీ ఆలయం నుంచి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, కేన్సర్ ఆస్పత్రి, పొదలకూరు రోడ్డు వైపు సుమారు 4 కిలోమీటర్లు పొడవున ఐదు డివిజన్లలో చెరువు విస్తరించి ఉంటుంది. కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో వైసీపీ నాయకులు పోటీ పడి చెరువును ఆక్రమించి మట్టిపోసి మెరక చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రెచ్చిపోయిన కబ్జాదారులు... రాత్రికి రాత్రే శ్మశానం ఆక్రమణ
భవిష్యత్తులో చెరువు కనుమరుగయ్యే ప్రమాదం : ఇప్పటికే చెరువు పొడవునా స్థలాన్ని ఆక్రమించి సుమారు 2 వందల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇళ్లలోని వ్యర్థాలను చెరువులోకి వదిలివేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్వర్ణాల చెరువు స్థలాన్ని ఆక్రమిస్తున్నా.. అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను కూల్చేందుకు రాజకీయ నేతలు మద్దతు పలుకుతున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. నాలుగు సంవత్సరాల నుంచి స్వర్ణాల చెరువు ఆక్రమణలతో కుంచించుకుపోతుంది. దీంతో చెరువు రూపురేఖలు మారిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో చెరువు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నగర వాసులు అంటున్నారు. దీని ఫలితంగా సాగునీటి ఇబ్బందులతో పాటు నెల్లూరు నగరవాసులకు తాగునీటి ఎద్దడి నెలకొనే ముప్పు పొంచి ఉంటుదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెరువు పవిత్రతను కాపాడాలని వేడుకోలు : స్వర్ణాల చెరువు ఎదురుగా కార్పోరేషన్ అధికారులు, దగ్గరలోనే కలెక్టర్ బంగ్లా ఉన్నా.. నిత్యం అధికారులు చూస్తున్నా ఆక్రమణలను పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకుని చెరువు పవిత్రతను కాపాడాలని కోరుతున్నారు.