నెల్లూరు జిల్లా కావలి నియోజవర్గంలో గ్రావెల్ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతుంది. కావలి చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రావెల్ అధికంగా లభ్యం అవుతుంది. ఇక్కడి గ్రావెల్కు గిరాకీ ఎక్కువే. పురపాలక సంఘానికి, చుట్టుపక్కల పంచాయతీలకు పన్ను చెల్లించకుండా అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు.
పట్టపగలే అక్రమ తవ్వకాలు చేస్తున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నాయకుల ఒత్తిళ్లతో అధికారులు ఏంచేయలేని పరిస్థితి నెలకొంది. కావలి చుట్టుపక్కల ముసునూరు, గాయత్రినగర్, మద్దూరుపాడు, తమ్మలపెంటరోడ్డు, అడవిలక్ష్మీపురం, కొత్తశివాలయం, పాతవూరు, రాజీవ్ నగర్ కాలనీల్లో అనధికారిక లేఅవుట్లు వేశారు. ఈ లేఅవుట్ల కోసం రోడ్డు పక్కన, చెరువుల్లో అడ్డుఆపు లేకుండా గ్రావెల్ తవ్వేస్తున్నారు. ఇటీవల వర్షాలకు ఈ గుంతల్లోకి నీరు చేరి ప్రమాదకరంగా మారాయి.
నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ(నుడా) అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. ల్యాండ్ కన్వర్షన్ లేని భూముల్లోనూ వ్యాపారం సాగిస్తున్నారు. రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె పిషింగ్ హార్బర్ ఆశ చూపిస్తూ...అనుమతులు లేని, రోడ్లు సరిగా లేని ప్లాట్లను రూ.లక్షలకు విక్రయిస్తున్నారు.
గ్రావెల్ అక్రమాలకు అడ్డుకట్టవేస్తామని అధికారులు అంటున్నారు. చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
ఇదీ చదవండి : వైకాపా నేత పీవీపీకి ఊరట..అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు