TDP MP Galla Jayadev: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని.. తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు మూడేళ్లుగా పోరాటం చేస్తున్నారని లోక్‌సభలో గుర్తు చేశారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు.
"రాజధాని కోసం సారవంతమైన 33వేల ఎకరాల భూములిచ్చిన 29 గ్రామాల రైతులు.. 2019 డిసెంబర్ నుంచి నిర్విరామంగా ఆందోళన చేస్తున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించడంపై ప్రకటన చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నారు. రైతులు ఆందోళన చేపట్టి డిసెంబర్ 18వ తేదీకి మూడేళ్లవుతుంది. హక్కుల సాధనకు ఇంత సుదీర్ఘ పోరాటం సాగిన రైతు పోరాటం మన దేశంలో లేదనే చెప్పాలి. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని ప్రధాని ప్రకటించాలని, అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించాలి" -గల్లా జయదేవ్, టీడీపీ ఎంపీ
పోలవరం సాంకేతిక సలహా మండలి ఆమోదించిన విధంగా... సవరించిన అంచనాల ప్రకారం నిధులు కేటాయించాలని జయదేవ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తిచేస్తే రాష్ట్రం పాడిపంటలతో కళకళలాడుతుంది. తాగునీటి అవసరాలు తీరతాయి. "పోలవరం సవరించిన అంచనాల ప్రకారం రూ.55 వేల 548 కోట్ల నిధుల కేటాయింపులకు ఆమోదం తెలపాలి. భూసేకరణ, ఆర్&ఆర్ ప్యాకేజీ కోసం ఈ నిధులు అవసరమవుతాయి." అని తెలిపారు.
అలాగే విభజన చట్టంలోని 18 ముఖ్యమైన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని జయదేవ్ లోక్‌సభలో గళమెత్తారు. "ఏపీ పునర్విభజన చట్టంలో ప్రకారం ముఖ్యమైన 18 హామీల అమలుకు చర్యలు చేపట్టాలి. హామీల అమలుకు ఇచ్చిన పదేళ్ల గడువు ఈ బడ్జెట్‌తో పూర్తవుతుంది. పునర్ విభజన చట్టం ప్రకారం ఈ సభ ఇచ్చిన హామీలను 2020 నాటికి పూర్తిచేయాలి. అందువల్ల వచ్చే బడ్జెట్ ఏపీకి చాలా ముఖ్యమైనది. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేలా నిధులు విడుదల చేయాలని ఆర్థికమంత్రిని కోరుతున్నాం." అని అన్నారు.
ఇవీ చదవండి: