kilkari Call Services: అన్నయ్యా.. వదినమ్మా నమస్కారం.. బాగున్నారా? కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘కిల్కారీ’ మొబైల్ సేవ నుంచి డాక్టర్ అనితను మాట్లాడుతున్నా. బిడ్డ ఆరోగ్య సంరక్షణకు మీరు ఆచరించేందుకు సులువుగా ఉండే విషయాలు చెబుతా. మనమంతా కలిసి మీ బిడ్డకు మెరుగైన భవిష్యత్తు అందిద్దాం’ అంటూ గర్భిణులకు నాలుగో నెలలో వాయిస్ మెసేజ్ వస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత ‘నమస్కారం. మీకు తెలుసా... పుట్టిన గంటలోగా బిడ్డకు పాలు తాగించాలి. తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారం. బిడ్డకు కావాల్సినవన్నీ వాటిలో ఉంటాయి’ అని చెబుతారు.
గర్భిణులు, బాలింతలు, శిశువుల సేవలకు కేంద్ర ప్రభుత్వం ‘కిల్కారీ’ (హిందీ పదం.. దీనికి తెలుగులో చిన్నారి చిరునవ్వు అని అర్థం) పేరుతో నూతన వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి తెచ్చింది. మాతాశిశు మరణాల నిరోధ చర్యల్లో ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రతి గర్భిణి, బాలింతను అప్రమత్తం చేస్తోంది. గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి పిల్లలు పుట్టిన ఏడాది వరకు ఏ వారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న సమాచారాన్ని 0124458000 నంబరు ద్వారా వారానికోసారి ఉచితంగా సెల్‌ఫోన్లకు అందిస్తున్నారు. ఇందులో మాతా, శిశు ఆరోగ్య సేవలు, టీకాల గురించి చెబుతారు. ఒకవేళ వినలేకపోతే.. 14423 నంబరుకు కాల్‌చేసి వినొచ్చు. ఈ విధానాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ 2016లో ప్రవేశపెట్టింది. తొలుత హిందీ, బెంగాలీ, బిహారీ, ఒడియా, అస్సామీ భాషల్లో మొదలైన ఈ సేవలు.. ఇటీవలే తెలుగులోనూ ప్రారంభమయ్యాయి.
ఈ నెల 2 నుంచి 8వ తేదీ మధ్య రాష్ట్రంలో 2.88 లక్షల మంది గర్భిణుల సెల్‌ఫోన్లకు సందేశాలు వెళ్లాయి. ఈ కాల్ ఒకటిన్నర నుంచి రెండు నిమిషాల వరకు ఉంటుంది. బిడ్డ పుట్టిన ఏడాది వరకూ ఈ సందేశాలు బాలింతల ఫోన్లకు వెళ్తూనే ఉంటాయి. ‘చేతులు పరిశుభ్రంగా లేకపోతే పిల్లలు తరచు విరేచనాల బారిన పడతారు. వయసుకు తగిన బరువు, మానసిక ఎదుగుదల ఉండదు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోండి’ వంటి సూచనలు ఇందులో ఉంటాయి.
ఇవీ చదవండి