America Teenage Pregnant : అది ఒక పాఠశాల.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం బ్రౌన్స్ విల్లే నగరంలో ఉంది. అక్కడ ఓ బడి ఉంది. దాని పేరు లింకన్ పార్క్. సహజంగా ఏ స్కూల్లోనుంచైనా విద్యార్థులు టీచర్ల అలికిడి వినిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం.. పసికందుల ఏడుపులు కూడా వినిపిస్తాయి. ఒకటీ రెండు కాదు.. చాలా గొంతులు గోల చేస్తాయి. ఎందుకంటే.. ఆ తరగతి గదిలో విద్యార్థులు మాత్రమే కాదు.. వారు కన్న పిల్లలు కూడా ఉంటారు. అలాగని వారంతా డబుల్ పీజీలు చదివిన విద్యార్థులు కాదు. పీహెచ్డీ చేస్తున్నవారు అంతకన్నా కాదు. జస్ట్.. టెన్త్ స్డాండర్డ్ కూడా దాటనివారే! "ఏంటిదంతా.." అంటున్నారు..? చాలా మంది అమెరికన్లు కూడా ఇదే ప్రశ్న వేసుకుంటున్నారు! స్వేచ్ఛ గురించి పైన చెప్పుకున్న ప్రశ్నలు వీళ్లు కూడా సంధిస్తున్నారు.
"అమెరికాలో కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుంది.. కానీ ఫ్రీగా ఏదీ దొరకదు" ఇది ఓ సినిమా డైలాగ్. ఇప్పుడు హద్దుల్లేని ఆ ఫ్రీడమే కొంప ముంచుతోందా? అనే చర్చ మొదలైంది ఆ దేశంలో. పెరిగిపోతున్న టీనేజ్ గర్భాలపై కొంత కాలంగా యూఎస్‌లో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితికి సజీవ సాక్ష్యమే టెక్సాస్ రాష్ట్రంలోని పాఠశాల. సెకండరీ స్థాయి ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేయకుండానే గర్భం దాల్చి.. బిడ్డలకు జన్మనిచ్చిన టీనేజర్ల జీవితం గమ్యంలేని ప్రయాణం కాకుండా చూసేందుకు ఈ పాఠశాల ప్రయత్నిస్తోంది.
గడిచిన మూడు దశాబ్దాల కాలంలో టీనేజ్ గర్భవతులు విపరీతంగా పెరిగిపోయారు. ఇలాంటి వారికి 2005 నుండి సేవలందిస్తోంది లింకన్ పార్క్ స్కూల్. ఇందులో ఉన్న విద్యార్థులంతా 14 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్నవారే. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. 15 నుండి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ప్రతీ వెయ్యి మంది యువతులలో.. 15 శాతం మంది 2020 సంవత్సరంలో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. దీన్ని బట్టి టీనేజ్‌లో గర్భధారణ అన్నది ఎంత సాధారణం అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ డేటాలో 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారి సమాచారం కలపలేదు. అవి కూడా చేర్చితే టీనేజ్ గర్భవతుల సంఖ్య మరింతగా పెరిగిపోతుంది. బ్రౌన్స్‌విల్లే నగరంలో ప్రతీ 10 టీనేజర్లలో ఒకరు బిడ్డకు జన్మనిచ్చారని లెక్కలు చెబుతున్నాయి.
ఇలాంటి అమ్మాయిల భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. చిన్నతనంలోనే గర్భం దాల్చిన వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒకసారి తల్లైన మహిళ.. గతంలో మాదిరి పటుత్వాన్ని తిరిగి పొందడం దాదాపుగా అసాధ్యం అంటారు నిపుణులు. అలాంటప్పుడు తమ శరీరమే పూర్తిగా ఎదగని వారు మరో బిడ్డకు జన్మనిస్తే దీర్ఘ కాలంలో ఎన్నో రకాల అనారోగ్యాలు చుట్టుముట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
మానసికంగా కూడా చాలా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. జీవితం అంటే ఏంటో సరిగా తెలియని వయసులో ఓ బిడ్డ భవిష్యత్తును నిర్మించే బాధ్యతను భుజాన వేసుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. జీవిత గమ్యమే తెలియని వాళ్లు.. ఓ బిడ్డను నెత్తికెత్తుకొని సామాజికంగా, ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ.. ముందుకు సాగడం అంత తేలిక కాదంటున్నారు. ఈ క్రమంలో డిప్రెషన్‌కు గురికావడంతో పాటు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
లింకన్ పార్క్ పాఠశాలలో చదువుకునే వారి సంఖ్య 70కి పైనే ఉంది. ఇక్కడ అడ్మిషన్లు ఏడాది పొడవునా కొనసాగుతూనే ఉంటాయి. అయితే.. ఇలా చదువుకునే వారిలో కేవలం సగం మంది మాత్రమే హైస్కూల్ చదువు పూర్తి చేస్తారు. మిగిలిన వారంతా పరిస్థితులు సహకరించక మధ్యలోనే స్కూల్ మానేస్తారు. కొందరు తమ బిడ్డల పోషణ కోసం హౌస్ కీపర్లుగా పని చేస్తుంటారు. ఇలాంటి వారంతా అనివార్యంగా చదువుకు దూరమైపోతారు. దాంతో వారి భవిష్యత్ క్రమంగా అంధకారం వైపు మళ్లుతుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వారి సంఖ్య రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అబార్షన్లపై ఈ ఏడాది ఆ దేశపు సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయంతో చట్టం మరింత కఠినంగా అమలు కానుంది. దీంతో.. అనివార్యంగా బిడ్డల్ని కనే టీనేజర్ల సంఖ్య పెరిగిపోతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కోరే గొంతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది అమెరికా నాట. మరి, భవిష్యత్‌లో ఈ పరిస్థితి ఏ రూపం తీసుకుంటుంది? అన్నది చూడాల్సి ఉంది.
ఇవీ చదవండి: