All Party Meeting under APUWJ: జర్నలిస్టు సమస్యలపై ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై జరిగిన సమావేశానికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ పంపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలపై పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. పత్రికా రంగంలోకి సాక్షి వచ్చిన తరువాత.. మీడియా రంగం విలువను దిగజార్చేలా వ్యవహరిస్తుందని నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మీడియా పతనమైందన్నారు. మీడియాపై విషం చిమ్మే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందన్నారు.
మఖ్యమంత్రి స్థానంలో ఉండి.. పేరు పెట్టి కొన్ని పత్రికల పేర్లు చెప్పడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. జర్నలిస్టులు చలో విజయవాడ పెట్టినా ప్రభుత్వం ఆంక్షల పేరుతో అణచివేస్తుందని మండిపడ్డారు. జర్నలిస్టుల మూడు ప్రధాన సమస్యలను టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తామని నక్కా ఆనంద్ బాబు అన్నారు.
ప్రభుత్వం తలుచుకుంటే పాత్రికేయుల సమస్యలు పరిష్కరించగలదు.. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకనే వారి సమస్యలను గాలికొదిలేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం లేదని రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరూ అడగకపోయినా అనేక మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు.. మరి జర్నలిస్టులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జర్నలిస్టులకు ఎటువంటి మంచి చేయడం లేదని అన్నారు.
అంతే కాకుండా రాష్ట్రంలో ప్రెస్ ఫ్రీడమ్ లేదని.. ప్రతి ఒక్కరూ భయం భయంగా పని చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలులో వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు.. జర్నలిస్టులపై వ్యవహరించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులను ఒక గదిలో పెట్టి.. షట్టర్ వేసి కొట్టారని రామకృష్ణ అన్నారు. జర్నలిస్టులు అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్ అందరూ తన ఆధీనంలో ఉండాలనుకుంటారు, ఎవరినీ లెక్క చేయరు, కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వరన్నారు. జీవో నెంబర్ 1 తెచ్చి రోడ్ పక్కన సమావేశాలు పెట్టకూడదని షరతు పెట్టారన్నారు. జగన్కు వ్యతిరేకంగా వార్తలు రాసే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. పాత్రికేయులు చేసే ఉద్యమాలకు తామంతా మద్దతుగా ఉంటామని వివిధ పార్టీలు తెలిపాయి.