YSRCP Leaders Occupying Government Lands: అధికార పార్టీ నేతల ఆగడాలు ఎక్కువయ్యాయని ప్రజలు అంటున్నారు. కనిపించిన స్థలాలను కబ్జా చేయటమే కాకుండా.. దౌర్జన్యాలు, దాడులతో హడలెత్తిస్తున్నారని వాపోతున్నారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. తమకు అడ్డే లేదన్నట్లు చెలరేగిపోతున్నారు. తాజాగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరులు ఓ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి.. అడ్డుకున్న వారిపై దాడికి దిగటం తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ స్థలంపై కన్ను: కర్నూలు ఓల్డ్ సిటీలోని.. అర్బన్ బ్యాంకు ఎదురుగా చింత నరసింహయ్య కుటుంబం 40 ఏళ్లుగా నివాసం ఉంటోంది. ఈ ఇంటికి తూర్పు వైపు నగరపాలక సంస్థ స్థలం ఉంది. ఈ స్థలంలోంచే నరసింహయ్య కుటుంబం రాకపోకలు సాగిస్తోంది. ప్రభుత్వ స్థలంపై కన్నేసిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరుడు ఇంతియాజ్.. ఎలాగైనా ఆక్రమించాలని నిర్ణయించుకున్నారు. స్థలాన్ని ఆక్రమించి చిన్న గుడిసె నిర్మించి, గుడిసె ముందు నాపరాయి ఫ్లోరింగ్ సైతం చేయించారు. ఈ స్థలాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో.. నరసింహయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థలాన్ని నగర పాలక సంస్థ స్వాధీనం చేసుకునేలా ఆదేశించాలని కోరారు.
అడ్డొచ్చిన వారిపై దాడి: ఇంతియాజ్ సైతం హైకోర్టుకు వెళ్లి తనకు ఇంజక్షన్ ఆర్డరు ఇవ్వాలని కోరారు. కానీ, తహసీల్దారు కార్యాలయం నుంచి తప్పుడు పత్రాలు సృష్టించారనే అభియోగంతో ఇంతియాజ్ పిటిషన్‌ను 2017 ఆగస్టు 18న హైకోర్టు కొట్టేసింది. ఎమ్మెల్యే తనకు అండగా ఉన్నారనే ధీమాతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం ధిక్కరించిన ఇంతియాజ్ గుడిసెను తొలగించి ఆ స్థలంలో రెండతస్తుల భవనాన్ని నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నరసింహయ్య కుమారుడు లక్ష్మీనారాయణ, కోడలు శశికళ పనులు అడ్డుకున్నారు. దీంతో సుమారు 20 మందితో కలిసి వీరిపై దాడి చేశారు.
బాధితులపై కూడా కేసు నమోదు చేసిన పోలీసులు: తమ కుటుంబానికి న్యాయం చేయాలని నరసింహయ్య కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్‌కు వెళితే.. దాడి చేసిన వారితోపాటు తమపై కూడా కేసు నమోదు చేశారని బాధితులు తెలిపారు. తమ సమస్యకు పరిష్కారం చూపించాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ను కలిశారు.
మమ్మల్ని కాపాడండి: తమకు ప్రాణహాని ఉందని.. ఎమ్మెల్యే అనుచరుల నుంచి కాపాడాలని కోరారు. ఈ స్థలాన్ని కాపాడటమే కాకుండా.. తమ ఇంటికి దారి ఇవ్వాలని వేడుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. వైఎస్సార్సీపీ నేతలు, వారి అనుచరులు చేస్తున్న ఆగడాలని అరికట్టాలని బాధితులు కోరుతున్నారు. ఎవరైనా నిలదీస్తే.. అన్యాయం అని ప్రశ్నిస్తే.. వారిపై దాడికి దిగటంపై.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
"మా ఇంటికి ఎదురుగా ఇల్లు కట్టాలని చూసినందుకు.. నేను అడ్డుకున్నాను. దీంతో నాపై అందరూ కలిసి దాడి చేశారు. నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అక్కడ ఇంతియాజ్ బాషా అనే వ్యక్తి మున్సిపల్ కార్పొరేషన్ స్థలంలో.. ఇల్లు కట్టాలని చూశాడు. మా ఇంటికి దారి లేకుండా చేయాలనుకున్నాడు. అందుకే మేము అడ్డుకున్నాము. మేము గత 40 సంవత్సరాలుగా ఉన్నాము. మా ఇంటి ముందు పిల్లలు ఆడుకోవడానికి కూడా లేకుండా చేశారు. మాకు ప్రాణహాని కూడా ఉంది సర్. మమ్మల్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం". - శశికళ, నరసింహయ్య కోడలు
ఇవీ చదవండి: