కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్య ప్రవర్తనపై అనుమానంతో హత్య చేశాడు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన సుస్మిత, ప్రతాప్ ఇద్దరూ ప్రేమించుకున్నారు. గత ఏడాది జూన్లో వివాహం చేసుకున్నారు. సుస్మిత ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి కూడా. పెళ్లి చేసుకున్న కొంతకాలానికే సుస్మిత ప్రవర్తనపై అనుమానం పెనుభూతంలా మారింది.
ఇలా చంపేశాడు..
ఆమెను హత్య చేసేందుకు ప్రణాళిక ప్రకారం నంద్యాలలో వైద్యుని వద్ద చూపిస్తానని తీసుకువెళ్లాడు. ఇంటికి తిరిగి వస్తూ నల్లగట్ల గ్రామం వద్ద ఓ నీటి కుంట దగ్గరకు తీసుకువెళ్లి.. ఆమెతో గొడవపడ్డాడు. చేతి మణికట్టును పదునైన ఆయుధంతో కోసి.. చేతులను కట్టేసి నీటి కుంటలో తోసేశాడు. భార్య చనిపోయిందని నిర్ధరించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న వెంటనే సుస్మిత బంధువులకు ఫోన్ చేసి.. భార్యను నీటి కుంటలో తోసి చంపేశానని సమాచారం ఇచ్చాడు.
బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చి.. సుస్మిత మృతదేహాన్ని వెలికి తీశారు. ఆళ్లగడ్డ గ్రామీణ సీఐ సుదర్శన ప్రసాద్ ఘటనా స్థలికి చేరుకొని వివరాలను సేకరించారు. సుస్మిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడితో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: కడప జిల్లాలో మహిళ దారుణ హత్య